స్పష్టత లేని పవార్ ఇంట్లో విపక్ష నేతల భేటీ!

దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రతిపక్ష పార్టీల సీనియర్‌ నేతలు, ప్రతినిధులు నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్‌పవార్‌ ఇంట్లో మంగళవారం సాయంత్రం జరిపిన భేటీ అసలు ఎందుకో స్పష్టత  లేకుండా పోయింది. భేటీ అనంతరం  సంయుక్త ప్రకటన గాని, కార్యాచరణ ప్రకటించడం గాని జరగక పోవడం గమనార్హం.

బిజెపి, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ నేతృత్వంలో తృతీయ కూటమి ఏర్పాటుకు శరద్ పవార్ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ భేటీ జరుపుతున్నట్లు మొదట్లో ప్రచారం జరిగింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో ఆయన ఇటీవల రెండు సార్లు భేటీ కావడంతో ఈ ప్రచారంకు బలం చేకూరింది. ప్రశాంత్ కిషోర్ సూచనతోనే ఈ భేటీ జరుగుతున్నట్లు కూడా సంకేతం ఇచ్చారు. 

అయితే ఐదుగురు కాంగ్రెస్ ఎంపిలను కూడా  ఆహ్వానించామని, కానీ వారెవ్వరూ హాజరు కాలేదని చెబుతున్నారు. ఈ భేటీ రాజకీయపరమైనది కాదని సమావేశంలో పాల్గొన్న నేతలు పేర్కొనడం గమనార్హం. రాజకీయ నాయకులు రాజకీయ అంశాలపై కాకుండా మారేందుకు సమావేశమైన్నట్లు? 

బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు వార్తలను కూడా కొట్టిపారేశారు. సమస్యల పరిష్కారాలపై ఏకాభిప్రాయం ఉన్న వారంతా కలిశామని చెప్పారు. రెండు గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది. అసలు ఈ భేటీని ఎవ్వరు జరిపారో కూడా స్పష్టత ఇవ్వలేక పోతున్నారు.

శరద్‌ పవార్‌ ఈ సమావేశం ఏర్పాటు చేయలేదని ఎన్సీపీ నేత మజీద్‌ మెనన్‌ చెప్పారు. రాష్ట్రీయ మంచ్‌ నేతృత్వంలో జరిగిందని తెలిపారు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన యశ్వంత్‌ సిన్హా 2018లో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రీయ మంచ్‌ పేరుతో కూటమిని ఏర్పాటు చేశారు. అయితే, భేటీకి ముందు ఎన్సీపీ నేత ఒకరు పవారే సమావేశం ఏర్పాటు చేశారని చెప్పడం గమనార్హం.

శరద్‌ పవార్‌ ఇంట్లో జరిగిన ఈ సమావేశంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు, రాష్ట్రీయ మంచ్‌ కన్వీనర్‌ యశ్వంత్‌ సిన్హా, సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఘన్‌శ్యామ్‌ తివారీ, ఆమ్‌ఆద్మీ పార్టీ నుంచి సుశీల్‌ గుప్తా, ఆర్‌ఎల్డీ అధ్యక్షుడు జయంత్‌ చౌదరి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నుంచి ఒమర్‌ అబ్దుల్లా, సీపీఐ నుంచి బినయ్‌ విశ్వం, సీపీఐ(ఎం) నుంచి నీలోత్పల్‌ బసు తదితరులు హాజరయ్యారు. 

కాంగ్రెస్‌ మాజీ నేత సంజయ్‌ ఘా, జనతాదళ్‌(యునైటెడ్‌) నేత పవన్‌ వర్మలతో పాటు అసలు రాజకీయాలతో తమకు సంబంధం లేదంటూ నిత్యం ప్రధాని మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగే   జావెద్‌ అక్తర్‌, మాజీ బ్యూరోకాట్‌ కేసీ సింగ్, రిటైర్డ్‌ జడ్జి ఏపీ షా తదితరులు కూడా పాల్గొనడం ఆసక్తి కలిగితుంది. రాజకీయంగా తమ ఉనికికోసం ఆత్రుత పడుతున్న వారంతా కలిసారా అనే అనుమానం కలుగుతున్నది.

కాగా,  పవార్‌తో భేటీ సమయంలో తాను కూటమికి సంబంధించి చర్చించలేదని ప్రశాంత్‌ కిశోర్‌ స్పష్టంచేశారు. మూడో ఫ్రంట్‌ ఏర్పడుతుందన్న నమ్మకం తనకు లేదని కూడా చెప్పారు. ప్రతిపక్షాల సమావేశంపై స్పందిస్తూ  పగటి కలలు కనడాన్ని ఎవరూ ఆపలేరంటూ బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ ఎద్దేవా చేశారు.