ఆర్భాటపు ముఖ్యమంత్రి కాలక్షేప పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాల పర్యటనలు కాలక్షేపానికి తప్పితే వాటి వాళ్ళ ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండడం లేదని బీజేపీ నేత విజయశాంతి మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  సీఎం పర్యటనలు అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని ఆమె  విమర్శించారు. 

ఈ పిచ్చి పర్యటనలు, మోసపు వాగ్దానాల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేకపోగా, అరెస్టులు, వేధింపులు తప్పడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పర్యటనలో ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ప్రజలను రోడ్లపైకి రాకుండా అడ్డుకుంటున్నారని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ జిల్లాల పర్యటనలో ఇంత నిర్బంధం ఉంటుందంటే దానికి బదులు ఆయన ఫామ్‌హౌస్‌లో ఉండడమే మంచిదని ప్రజలు చెప్పుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ వెళ్లే ధైర్యం లేకపోవడం వల్లే ఇటు పక్కనున్న సిద్దిపేట, అటుపక్కనున్న వరంగల్, దాని పక్కనున్న యాదాద్రి జిల్లాల్లో కేసీఆర్ పర్యటిస్తున్నట్టు అనిపిస్తోందని ఆమె దుయ్యబట్టారు.

కేసీఆర్ పర్యటనలో కొందరు పోలీసు అధికారులు ప్రతిపక్ష నాయకులకు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని ఆమె  ఆరోపించారు. ఇలా ప్రవర్తించడం సరికాదని ఆమె హితవు చెప్పారు.  

పేరుకే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తప్ప కేసీఆర్ పర్యటన వల్ల ప్రజలు, నిరుద్యోగుల జీవితాలు మారడం లేదని ఆమె విమర్శించారు. ప్రచార ఆర్భాటం కలిగిన సీఎం పర్యటనలు కాలక్షేపంగా మారిపోతున్నాయని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.