కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై సీఈసీ వేటు

కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత  వేటు వేసింది. మూడేళ్లపాటు చట్ట సభల్లో పోటీ చేయకుండా సీఈసీ వేటు వేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నిర్ణీత గడువులోగా ఎన్నికల వ్యయం వివరాలను బలరాం నాయక్‌ సమర్పించలేదు.

దీంతో ఆయన మూడేళ్లపాటు పార్లమెంట్‌ ఉభయసభలకు, శాసనసభ, శాసన మండలికి పోటీ చేసే అర్హతను కోల్పోయినట్లు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.

గతంలో కాంగ్రెస్ తరపున 2009లో ఎంపీగా బలరాం నాయక్‌ ఎన్నికయ్యారు. అనంతరం ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేబినెట్‌లో ఆయన మంత్రిగా పని చేశారు. 

కాగా, మహబూబాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరి వెంకటేశ్వరరావు, నల్గొండ నుంచి పోటీ చేసిన బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థి వెంకటేశ్, స్వతంత్ర అభ్యర్థి రొయ్యల శ్రీనివాసులు, మెదక్ నుంచి శివసేన తరఫున పోటీ చేసిన హన్మంతరెడ్డిలపై కూడా ఈసీ అనర్హత వేటు వేసింది.