కరోనా కోరల్లో మరో మావోయిస్టు నేత హిద్మా

మావోయిస్టు నేతలు ఒక్కొక్కరుగా కరోనా కోరల్లో చిక్కుకుంటున్నారు. ఛత్తీసగఢ్‌లో 22 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న కేసులో సూత్రధారి, మావోయిస్టు నేత మాద్వి హిద్మా తాజాగా కొవిడ్‌ వైరస్‌ బారినపడ్డారు. 

ఆయనతో పాటు ఛత్తీసగఢ్‌ బస్తర్‌ రీజియన్‌లో క్రియాశీలకంగా ఉన్న పలువురు అగ్ర నేతలకు కూడా వైరస్‌ సోకినట్టు విశ్వసనీయ సమాచారం ఉందని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్‌  తెలిపారు. 

మావోయిస్టు నేతలు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్‌ వికల్ప్‌(డీకేఎ్‌సజెడ్‌సీ సభ్యుడు), మూల దేవేందర్‌రెడ్డి అలియాస్‌ మాసా దాడ(డీకేఎ్‌సజెడ్‌ఎం), కుంకటి వెంకటయ్య అలియాస్‌ వికా్‌స(దక్షిణ బస్తర్‌ డీవీసీ కార్యదర్శి) కరోనాతో అనారోగ్యం పాలయ్యారని వివరించారు.

పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) బెటాలియన్‌-1 కమాండర్‌  హిద్మా ఆచూకీ తెలిపిన వారికి ఛత్తీసగఢ్‌ సర్కారు రూ.25 లక్షలు, వివిధ రాష్ట్రాలు, ఏజెన్సీలు మరో రూ.20 లక్షల రివార్డు ప్రకటించాయి. పీఎల్‌జీఏ కమాండర్లు సోబ్రాయ్‌, నందు కరోనాతో మరణించారు.

మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యులు కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌, తిప్పరి తిరుపతి అలియాస్‌ దేవూజీ సహా 12 మంది నేతలు కరోనా బారినపడ్డారని పోలీసులు చెప్పారు. 

కాగా, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్‌ అలియాస్‌ యాప నారాయణ(50) కరోనా బారినపడి.. చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించినట్టు ఎస్పీలు సునీల్‌దత్‌, నంద్యాల కోటిరెడ్డి ధ్రువీకరించారు.