యోగాను సురక్ష కవచంగా మార్చుకోవాలి 

యోగాను సురక్షా కవచంగా మార్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. కరోనాపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పోరుజరుగుతున్న వేళ యోగా ఆశాకిరణంగా మారిందని పేర్కొన్నారు.

యోగా ద్వారా రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుందని, దీనిపై అధ్యయనాలు జరుగుతున్నాయని వెల్లడించారు. కరోనా నుంచి రక్షణకు శారీరక దృఢత్వం పెంచుకోవాలన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.కరోనా మహమ్మారి సమయంలో యోగా యోగా ఆశాకిరణంగా మారినదని చెబుతూ ఇది మనలో అంతర్గత శక్తిని పెంపొందించడమే కాకుండా ఈ మహమ్మారిని ఎదుర్కోగలమనే విశ్వాసం కలిగించిందని ప్రధాని చెప్పారు.

ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి రూపొందించిన యోగా యాప్ ప్రధాని ఆవిష్కరించారు. అందులో యోగా గురించిన ఒక  వీడియో ఉంటుంది. ప్రపంచంలోని అన్ని ముఖ్య భాషలలో ఈ యాప్ అందుబాటులోకి వస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. “ఒక ప్రపంచం – ఒక ఆరోగ్యం” అని మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది ఉపయోగపడగలదని ప్రధాని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

యోగా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లామని చెప్పారు. యోగా ద్వారా ప్రతి దేశం, సమాజం స్వస్థత పొందుతున్నాయని తెలిపారు. యోగాను ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశంలోని ప్రతి మూలా లక్షలాది మంది యోగా సాధకులుగా మారారని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.

యోగా ద్వారా మంచి ఆరోగ్యం సమకూరుతుందని, దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని మోదీ చెప్పారు. శారీరక, మానసిక దృఢత్వాన్ని యోగా పెంపొందిస్తుందని, అంతర చైతన్యం పెంపొందుతుందని వెల్లడించారు.

అనేకమంది ఫ్రంట్ లైన్ వర్కర్లు, వైద్యులు కరోనా మహమ్మారి నుండి రక్షణ కోసం యోగాను అభ్యాసం చేస్తున్నట్లు తనకు చెప్పారని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. కేవలం ఈ మహమ్మారి నుండి తమను తాము కాపాడుకోవడానికి మాత్రమే కాకుండా, రోగులకు రక్షణ కల్పించడానికి కూడా యోగ వారికి సహాయపడుతున్నదని తెలిపారు.

కరోనాతో భారత్‌ సహా పలుదేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయని గుర్తు చేశారు. దీంతో రెండేండ్లుగా బహిరంగ కార్యక్రమాలు లేవని, భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా సామూహిక కార్యక్రమాలు నిలిచిపోయాయని చెప్పారు. విపత్తు వేళ యోగా పట్ల ప్రజలు ఉత్సాహం కనబరుస్తున్నారని చెబుతూ జనసామాన్యానికి ఆరోగ్య సంరక్షణకు, రోగ నిరోధానికి యోగా విశేషంగా ఉపయోగపడుతూ ఉండగలదని భరోసా వ్యక్తం చేశారు.