బెంగాల్ లో గ్రామాలను విడుస్తున్న వేలాదిమంది 

ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత దేశంలో తొలిసారి వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను, గ్రామాలను విడిచిపెట్టి సరిహద్దు దాటుతున్నార‌ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. త‌మ‌ను క్ష‌మించాల‌ని మమతా బెనర్జీ, టీఎంసీని వేడుకుంటున్నార‌ని, మ‌తం మ‌రేందుకు కూడా సిద్ధ‌మ‌ని చెబుతున్నార‌ని ఆమె విమ‌ర్శించారు. 

మ‌హిళ‌ల‌ను ఇండ్ల నుంచి బ‌ల‌వంతంగా తీసుకెళ్లి బ‌హిరంగ లైంగిక‌దాడికి పాల్ప‌డుతున్నార‌ని స్మృతి ఇరానీ ఆరోపించారు. దళిత లేదా గిరిజన మహిళల‌ను కూడా వ‌దిలిపెట్ట‌డం లేద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరేండ్ల మ‌నువ‌డి ముందు త‌న‌పై లైంగిక దాడికి పాల్ప‌డ్డార‌ని ఆరోపిస్తూ 60 ఏండ్ల మ‌హిళ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింద‌ని స్మృతి ఇరానీ గుర్తు చేశారు.

బీజేపీ కార్య‌క‌ర్త కావ‌డం వ‌ల్ల‌నే ఆమెపై ఈ దారుణానికి పాల్ప‌డ్డార‌ని ఆమె  మండిప‌డ్డారు. ఇంకా ఎంత మంది మ‌హిళ‌లు ఇలాంటి దారుణాల‌ను మౌనంగా భ‌రించాలి అని కేంద్ర మంత్రి ప్ర‌శ్నించారు.

కేంద్ర మంత్రుల కార్ల‌పై రాళ్ల దాడి జ‌రుగుతున్న‌ప్పుడు వారి రాష్ట్రంలో సామాన్యులు సురక్షితంగా ఉన్నారా? అని మానవ హక్కుల కార్యకర్తలుగా చెప్పుకునే వారిని తాను ప్రశ్నించాలనుకుంటున్నాన‌ని ఆమె చెప్పారు. అత్యాచారానికి గురైన మహిళల కోసం ప్రెస్ క్లబ్ ముందు ఎందుకు నిర‌స‌న తెలుప‌లేదు అని స్మృతి ఇరానీ ప్ర‌శ్నించారు.

మమతకు హైకోర్టు లో మరో ఎదురు దెబ్బ 

కాగా,  ప‌శ్చిమ బెంగాల్  ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌భుత్వానికి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. ఎన్నిక‌ల అనంత‌రం జ‌రిగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల కేసుల‌ను ప‌రిశీలించేందుకు ఒక క‌మిటీని నియ‌మించాల‌ని జాతీయ మాన‌వ హ‌క్కుల సంఘాన్ని కోల్‌క‌తా హైకోర్టు ఈ నెల 18న‌ ఆదేశించింది. 

అయితే ప్ర‌భుత్వం, ప్ర‌భుత్వ అధికారుల‌కు వ్యతిరేకంగా ఉన్న‌ ఈ తీర్పును వెన‌క్కి తీసుకోవాల‌ని కోరుతూ బెంగాల్ ప్ర‌భుత్వం ఒక పిటిష‌న్‌ను దాఖ‌లు చేసింది. ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బిందాల్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం సోమ‌వారం ఈ పిటిష‌న్‌ను ప‌రిశీలించి తిరిస్క‌రించింది.

 రాష్ట్రంలో ఎన్నిక‌ల ఫ‌లితాల అనంతరం జ‌రిగిన‌ హింస కారణంగా ప్రజలు త‌మ నివాసాల‌ను వీడ‌టం, భౌతిక దాడులు, ఆస్తుల నాశనం, వ్యాపార స్థలాలను దోచుకోవడం వంటి ఆరోపణలతో ప‌లు పిటిషన్లు దాఖ‌లైన నేప‌థ్యంలో ఎన్‌హెచ్ఆర్సీ ప‌రిశీల‌న‌కు ఆదేశించామ‌ని కోర్టు పేర్కొంది.