2020లో భారత్ కు  6400 కోట్ల డాల‌ర్లు  ఎఫ్‌డీఐలు 

భారత్ కు 2020లో భారీ ఎత్తున విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు (ఎఫ్‌డీఐ) వ‌చ్చాయి. గ‌తేడాది 6400 కోట్ల డాల‌ర్లు (సుమారు రూ.4.75 ల‌క్ష‌ల కోట్లు) ఎఫ్‌డీఐలు వ‌చ్చిన‌ట్లు ఐక్య‌రాజ్య స‌మితి తాజా నివేదిక వెల్ల‌డించింది. ఇది ప్ర‌పంచంలోనే ఐదో అత్య‌ధిక‌మ‌ని తెలిపింది. 

అయితే క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై తాత్కాలిక ప్ర‌భావం ప‌డ‌నుంద‌ని ఈ రిపోర్ట్ చెప్పింది. యూఎన్ కాన్ఫ‌రెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఈ వ‌ర‌ల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ రిపోర్ట్ 2021ని విడుద‌ల చేసింది.

నిజానికి గ‌తేడాది క‌రోనా మ‌హమ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబడుల‌పై తీవ్ర ప్ర‌భావం చూపింద‌ని, అంత‌కుముందు ఏడాది 1.5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లుగా ఉన్న ఎఫ్‌డీఐలు, గ‌తేడాది 1 ల‌క్ష కోట్ల డాల‌ర్ల‌కే ప‌రిమిత‌మైంద‌ని వెల్ల‌డించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా లాక్‌డౌన్లు కొన‌సాగుతున్న పెట్టుబ‌డుల ప్రాజెక్టుల వేగాన్ని త‌గ్గించింద‌ని తెలిపింది.

అయితే భారత్ లో మాత్రం ఎఫ్‌డీఐలు 27 శాతం పెరిగి 6400 కోట్ల డాల‌ర్ల‌కు చేరిన‌ట్లు ఈ నివేదిక వెల్ల‌డించింది. ఇది ప్ర‌పంచంలోనే ఐదో అత్య‌ధిక ఎఫ్‌డీఐల మొత్త‌మ‌ని తెలిపింది. మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా డిజిట‌ల్ మౌలిక స‌దుపాయాల‌కు డిమాండ్ పెరిగింద‌ని, ఇది కూడా ఇండియాలో ఎఫ్‌డీఐ వృద్ధికి దోహ‌ద‌ప‌డింద‌ని ఆ నివేదిక తెలిపింది.