
కొవిడ్ విపత్కాలంలో వైద్య సేవల కోసం ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ నిధులను సద్వినియోగం చేసుకోవడంలో దక్షిణాది రాష్ట్రాలు అగ్రభాగాన నిలిచాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ అత్యధికంగా నిధులను ఉపయోగించుకున్నాయి.
సమాచార హక్కు చట్టం కింద వివేక్ పాండే అనే కార్యకర్త చేసుకున్న దరఖాస్తుకు జాతీయ ఆరోగ్య సంస్థ ఈ మేరకు వివరాలు అందజేసింది. గతేడాది మార్చి 20 నుంచి ఈ ఏడాది మే వరకు కొవిడ్ నిర్ధారణ పరీక్షలకు, బాధితులకు వైద్య సేవల కోసం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ పథకం నుంచి వాడుకున్న నిధుల వివరాలను వెల్లడించింది.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన పథకమైన ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ కింద మొత్తం రూ 2223.57 కోట్లను విడుదల చేశారు. ఇందులో 75 శాతం అంటే రూ 1680 కోట్ల నిధులను దక్షిణాది రాష్ట్రాలే వాడుకున్నాయి. ఈ పథకం కింద అత్యధికంగా కర్ణాటక రూ 770 కోట్లను సద్వినియోగం చేసుకుని, 1.62 లక్షల మంది కొవిడ్ బాధితులకు ఉచితంగా వైద్య సేవలు అందించింది.
ఆంధ్రప్రదేశ్ రూ 413 కోట్లను వాడుకుని 1.54 లక్షల మందికి పైగా బాధితులకు చికిత్స చేయించింది. కాగా ఆయుష్మాన్ పథకం కింద బిహార్ కేవలం 3 లక్షల రూపాయలే ఖర్చు చేసింది. ఇక ఉత్తరప్రదేశ్ రూ 1.51 కోట్లు, రాజస్థాన్ రూ 8.66 కోట్లు, మధ్యప్రదేశ్ రూ 34.39 కోట్లు, ఛత్తీసగఢ్ రూ 41.85 కోట్లు వాడుకున్నాయి.
దక్షిణాది రాష్ట్రాలు మినహా మహారాష్ట్ర మాత్రమే అత్యధికంగా రూ 424 కోట్లు ఉపయోగించుకుంది. మధ్యప్రదేశ్, ఛత్తీసగఢ్‌లపై కరోనా రెండో వేవ్ ఎక్కువగా ప్రభావం చూపినా, భారీగా కేసులు నమోదైనా, బాధితులకు వైద్య సేవల కోసం ఆయుష్మాన్ నిధులను ఉపయోగించుకోవడంలో ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు విఫలమయ్యాయి.
More Stories
ఐదేండ్లలో రూ. 400 కోట్ల పన్ను చెల్లించిన అయోధ్య ట్రస్ట్
భారత్, న్యూజిలాండ్ ఎఫ్టిఎ చర్చలు పునఃప్రారంభం
దేశంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ కుంభకోణాలు