అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరల మంటలు

అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు భగ్గుమంటూ ఉండడంతో, స్థానిక పన్నులతో కలిపి భారత్ లో సహితం పెట్రోల్, డీజిల్ ధరలు  భ‌గ‌భ‌గ‌మని మండుతున్నాయి. పెట్రోల్ ఉత్ప‌త్తుల‌కు పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అంత‌ర్జాతీయంగా ముడి చ‌మురు ధ‌ర పెరుగుతున్న‌ది.

దీనికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ‌సూలు చేస్తున్న క‌స్ట‌మ్స్ డ్యూటీ, వ్యాట్‌, ఇత‌ర సెస్‌ల వ‌ల్ల పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఆకాశాన్నంటే రీతిలో పైపైకి దూసుకెళ్తున్నాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ ముడి చ‌మురు ధ‌ర 74 డాల‌ర్ల‌కు చేరువ‌లో ఉంది.

ఈ వారం అమెరికా మార్కెట్‌లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధ‌ర 0.43 డాల‌ర్లు పెరిగి 73.51 డాల‌ర్ల‌కు చేరుకున్న‌ది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ (డ‌బ్ల్యూటీఐ)లో బ్యారెల్ ముడి చ‌మురు 0.60 డాల‌ర్లు పెరిగి 71.64 డాల‌ర్ల వ‌ద్ద స్థిర‌ప‌డింది. ప‌రిస్థితులు ఇలాగే కొన‌సాగితే బ్యారెల్ ముడి చ‌మురు ధ‌ర త్వ‌ర‌లో 75 డాల‌ర్ల‌కు చేరుతుంద‌ని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా చెప్పారు.

మ‌రోవైపు భార‌త క‌రెన్సీ రూపాయిపై డాల‌ర్ బ‌ల‌ప‌డింది. ప్ర‌స్తుతం డాల‌ర్ విలువ రూ.74 మార్క్‌ను దాటేసింది. మున్ముందు రూ.75ల‌కు చేరుకుంటుంద‌ని అనూజ్ గుప్తా పేర్కొన్నారు. దీని ప్ర‌కారం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త్వ‌ర‌లో ఒక‌టి, రెండు రూపాయ‌లు పెరుగుతాయ‌ని అంచ‌నా వేశారు.

పాకిస్థాన్‌తో పోలిస్తే భార‌త్‌లో పెట్రోల్‌పై రెట్టింపు ప‌న్నులు ఉన్నాయి. పాకిస్థాన్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.52 ప‌లుకుతున్న‌ది. కేంద్ర ప్ర‌భుత్వం విధించిన ట్యాక్స్ ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉన్నాయి.

దేశంలో లీట‌ర్ పెట్రోల్ బేస్ ధ‌ర రూ.33గానే ఉంది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు విధించిన ప‌న్నుల వ‌ల్ల లీట‌ర్ పెట్రోల్ లేదా డీజిల్ ధ‌ర‌లు రూ.100 మార్క్‌ను దాటాయి. కేంద్రం ఎక్సైజ్ సుంకంగా రూ.33 విధిస్తున్న‌ది. రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌న్నులు బేస్ ధ‌ర కంటే మూడు రెట్లు ఎక్కువ‌గా ఉన్నాయి. పాకిస్థాన్‌లో మొత్తం ప‌న్నులు రూ.21.04 ఉంది. కానీ భార‌త్‌లో ప‌న్నులు రూ.54 పై చిలుకే.

మ‌హారాష్ట్ర‌, రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ల‌తోపాటు 13 రాష్ట్రాల్లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.100 దాటేసింది. తాజాగా రాజ‌స్థాన్లోని శ్రీ‌గంగాన‌గ‌ర్‌, హ‌నుమాన్ గ‌ఢ్‌ల‌లో లీట‌ర్ డీజిల్ ధ‌ర సెంచ‌రీ మార్క్‌ను అధిగ‌మించింది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, రాజ‌స్థాన్ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.100 దాటింది. బీహార్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, జ‌మ్ము క‌శ్మీర్‌, మ‌ణిపూర్‌, ఒడిశా, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల‌తోపాటు చండీగ‌ఢ్‌, ల‌డ‌ఖ్‌ల్లో రూ. 100 మార్క్‌ను అధిగ‌మించింది.

గ‌త నెల‌లో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు 16 రెట్లు పెరిగాయి. లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.4.11, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.4.69 పెరిగింది. ఈ ఏడాది జ‌న‌వ‌రి ఒక‌టో తేదీన లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.83.97, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.74.12 ప‌లికింది. ప్ర‌స్తుతం ఇదే లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.96.12, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.86.98కి చేరుకున్న‌ది. కేవ‌లం ఐదు నెల‌ల్లోపు లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.12.15, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.12.86 ప్రియమైంది.

కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గిపోవడం, వైద్య రంగంపై గణనీయంగా ఖర్చులు చేయాల్సి రావడం, దీంతో పాటు సంక్షేమ రంగంపై కూడా ఖర్చులు చేయాల్సిన అవసరం ఏర్పడడంతో పెట్రో ధరలు తగ్గించడం కుదిరే విషయం కాదని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గత వారం స్పష్టం చేయడం గమనార్హం.