తెలంగాణ సమాజానికి శతకోటి వందనాలు

అపార ప్రేమాభిమానాలతో, ఆశీర్వచనాలతో ముంచెత్తిన నిష్కల్మష, ప్రగతిశీల తెలంగాణ సమాజానికి శతకోటి వందనాలు అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తెలిపారు. ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా తనని పలకరించి దీవించారని, స్వంత పనులు ఎవ్వరూ ప్రస్తావించలేదని స్పష్టం చేశారు.

వారు కోరిందల్లా న్యాయ వ్యవస్థను పటిష్టపరచమని మాత్రమేనని చెబుతూ తెలంగాణ సమాజపు నిస్వార్థ గుణానికి, పరిణతికి ప్రతీకలు వారు అని సీజేఐ కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల పర్యటన తనకెంతో సంతృప్తినిచ్చిందని జస్టిస్‌ రమణ తెలిపారు.

తెలుగు రాష్ట్రాల  పర్యటన ముగించుకుని సీజేఐ తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళ్తున్న సందర్భంగా తన పర్యటనపై సీజేఐ స్పందిస్తూ.. భారత న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానానికి చేరుకున్న ఈ సమయంలో తనను చూసి గర్వించడానికి, మనస్ఫూర్తిగా అభినందించడానికి తన  తల్లిదండ్రులు ఈ లోకంలో లేరన్న వాస్తవం బాధిస్తూ ఉండేదని త్లెఇపారు.

అయితే,  భారత ప్రధాన న్యాయమూర్తిగా తన ఈ వారం రోజుల తొలి పర్యటనలో తెలుగు ప్రజలు ఆ లోటు తీర్చారని సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మొదలుకుని అతి సాధారణ పౌరుని వరకు ప్రతి ఒక్కరూ ఈ అసాధారణ సమయంలో వ్యవ ప్రయాసలకోర్చి నాకు స్వాగతం పలికి అంతా మనోళ్లే అన్న తెలంగాణ నైజానికి సుప్రసిద్ధ హైదరాబాదీ అతిథ్యానికి అద్దం పట్టారని కృతజ్ఞతలు త్లెలిపారు.

అనూహ్య స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌, సీఎం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు, మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు, సకల పక్షాల నాయకులు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

దివ్యాతి దివ్యమైన దైవ దర్శనానికి, ఆశీర్వచన ప్రాప్తికి అల్ప వ్యవధిలో అన్ని ఏర్పాట్లు చేసిన తిరుమల తిరుపతి, యాదాద్రి, శ్రీశైలం దేవస్థానాల పాలక మండళ్లకు, ప్రభుత్వ ప్రతినిధులకు, స్థానిక అధికారులకు తాను, తన సతీమణి శివమాల సదా కృతజ్ఞులం అని పేర్కొన్నారు. యాదాద్రిని దేశంలోనే అతి ముఖ్య తీర్థ యాత్రా స్థలాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయం అని కొనియాడారు.

వారం క్రితం తెలుగు నేలపై కాపు మోపినప్పటి నుండి నేడు ఢిల్లీ బయల్దేరేవరకు తనను, తన సిబ్బందిని కంటికి రెప్పలా చూసుకున్న తెలంగాణ ప్రభుత్వ అధికారులకు, రాజ్‌భవన్‌ సిబ్బందికి, హైకోర్టు సిబ్బందికి, పోలీసు సిబ్బందికి, ఎంతగానో సహకరించిన పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలిపారు.

కొవిడ్‌ ముప్పు పూర్తిగా తొలగిపోయిందని శాస్త్రవేత్తలు, ప్రభుత్వం నిర్ధారించేంతవరకు దయచేసి తగు జాగ్రత్తలు పాటిస్తూనే ఉండండి అంటూ హితవు పలికారు. నిర్లక్ష్యం ఏ మాత్రం తగదని హెచ్చరించారు. తెలుగు ప్రజల దీవెనల బలంతో తన రాజ్యాంగ బద్ధ విధులను సమర్థంగా నిర్వహించగలనన్న నమ్మకంతో తిరుగు ప్రయాణమవుతున్నట్లు సీజేఐ తెలిపారు.