కేసీఆర్ జిల్లాల పర్యటనల కోసమే లాక్‌డౌన్ ఎత్తేశారా!

కరోనా కట్టడికి ఎలాంటి చర్యలూ ప్రకటించకుండానే లాక్‌డౌన్ ఎత్తేసిన రోజునే జిల్లాల్లో పర్యటనలు, ప్రారంభోత్సవాలు మొదలుపెట్టారని సినీ నటి, బిజెపి నేత విజయశాంతి విమర్శించారు. తన దత్తత గ్రామంలో వేలాదిమందితో సామూహిక భోజనాలకు కూడా ప్లాన్ వేశారని ఆమె ధ్వజమెత్తారు. 
 
ఇదంతా చూస్తుంటే కరోనా తగ్గిపోయిందని ఈ కార్యక్రమాలు పెట్టారో… లేక ఈ మొత్తం ప్రోగ్రాం కోసం తెలంగాణలో కరోనా తగ్గిపోయిందని తప్పుడు నివేదికలు తెప్పించి లాక్ డౌన్ ఎత్తేశారనిపిస్తోందని ఆమె స్పష్టం చేశారు.  ప్రజలు ఆ మాత్రం గ్రహించలేని వెర్రివాళ్ళు కాదని ఆమె హెచ్చరించారు. 
 
నిన్నటి వరకూ కరోనా పేరిట పగలు కొన్ని గంటల పాటు, రాత్రి మొత్తం లాక్‌డౌన్ పెట్టి… చివరికి పాజిటివ్ రేటు తగ్గిపోయిందంటూ ఉన్నట్టుండి లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేశారని ఆమె ఎద్దేవా చేశారు. ఇది చాలక పేరెంట్స్ వద్దంటున్నా జులై నుంచి విద్యా సంస్థల్ని తెరిచేందుకు అనుమతులిచ్చి విద్యార్థుల ప్రాణాల్ని పణంగా పెట్టేందుకు సిద్ధమయ్యారని ఆమె మండిపడ్డారు.
 
 తెలంగాణ ప్రజలంటే శుద్ధ అమాయకులని, ఇట్టే మోసం చెయ్యవచ్చనేది సీఎం కేసీఆర్ గట్టి విశ్వాసమని విజయశాంతి పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల్లో ఇంకా కఠిన నిబంధనల మధ్య లాక్‌డౌన్లు నడుస్తున్నాయని, పొరుగుతున్న మహారాష్ట్రలో కొవిడ్ డెల్టా ప్లస్ వేరియంట్ ప్రజల్ని భయపెడుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 
 
తమిళనాడులో మరో పది రోజులు లాక్‌డౌన్ పొడిగించారని ఆమె గుర్తుచేశారు. కర్ణాటకలోనూ దాదాపు ఇవే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఇంత జరుగుతున్నా పాలకులు తమ ప్రయోజనాల కోసం ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేందుకు సిద్ధపడ్డారని విజయశాంతి విమర్శించారు. ఇలాంటి సర్కారు బారిన పడినందుకు రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందని రోజు లేదనడం ఏమాత్రం అతిశయోక్తి కాదని ఆమె స్పష్టం చేశారు.