మూర్ఖుడిలా వ్యవహరిస్తున్న జగన్… కేసీఆర్ ఆగ్రహం 

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మూర్ఖుడిలా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.  మూర్ఖత్వంలో జగన్‌ తన తండ్రి రాజశేఖర్‌రెడ్డిని మించి పోయారని మండిపడ్డారు. కృష్ణా బేసిన్‌లో ఏపీ సర్కారు అక్రమ ప్రాజెక్టులు చేపడుతున్నదని ఆరోపించారు. 

శనివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన దాదాపు ఆరున్నర గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన కేబినెట్‌ భేటీలో  ఏపీ ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు, వాటిని అడ్డుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా  ఏపీ సీఎం జగన్‌పై కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపదిన్నట్లు చెబుతున్నారు. 

తెలంగాణకు అన్యాయం చేసే విషయంలో నాటి ఉమ్మడి ఏపీ సీఎం  రాజశేఖర్‌రెడ్డి కంటే మూర్ఖంగా జగన్‌ ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు. పైగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌కు చట్టాలపై ఏమాత్రం గౌరవం లేదని, అక్రమ ప్రాజెక్టులే అందుకు నిదర్శనమని మండిపడ్డారు.  

ఈ విషయమై ఏపీ ప్రభుత్వానికి అడ్డుకట్ట వేయాల్సిందేనని, ఇందుకోసం ఎక్కడివరకైనా పోరాటం చేద్దామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోవద్దని, అవసరమైతే టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలందరితో ఢిల్లీలో ధర్నా చేద్దామని ప్రతిపాదింఛాయారు. న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయిద్దామని, వాస్తవాల ప్రాతిపదికన ముందుకెళ్దామని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కృష్ణా బేసిన్‌లో ఏపీ సర్కారు కుట్రలను కట్టడి చేయటానికి మన దగ్గర కూడా ఏడెనిమిది ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకుందామని సూచించారు.

కాగా, కృష్ణా బేసిన్లో ఆంధ్రప్రదేశ్‌ నిర్మిస్తున్న అనుమతిలేని ప్రాజెక్టులపై తాడో పేడో తేల్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశించినా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను నిలుపు చేయడం లేదని, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా పోవాలని కేబినెట్‌ నిశ్చయించింది.

రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో గళం విప్పాలని అభిప్రాయపడింది. ఏపీ ప్రాజెక్టుల కారణంగా జరగబోయే తీవ్ర నష్టాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని నిశ్చయించింది. ఏపీ ప్రాజెక్టులతో పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని అభిప్రాయపడింది.

అందుకే రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా కోసం కృష్ణా బేసిన్లోనూ ప్రాజెక్టులను నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా, ‘జోగులాంబ బ్యారేజీ’ పేరిట గద్వాల, వనపర్తి జిల్లాల మధ్య అలంపూర్‌ వద్ద కృష్ణా నదిపై ఓ బ్యారేజీని నిర్మించాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. గుమ్మడం, గొందిమల్ల, వెలటూరు, పెద్ద మారూరు గ్రామాల పరిధిలో దీనిని నిర్మించనుంది. ఇక్కడి నుంచి 60-70 టీఎంసీల వరద నీటిని పైపులైను ద్వారా తరలించాల ని భావిస్తోంది.