అత్యాచారం ఆరోపణపై తమిళనాడు మాజీ మంత్రి అరెస్ట్ 

విదేశీ మ‌హిళ‌ను అత్యాచారం చేశాడ‌నే ఆరోప‌ణ‌ల‌పై మాజీ మంత్రిని పోలీసులు అరెస్టు చేశారు. అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి ఎం మ‌ణికంద‌న్‌ను ఆదివారం ఉద‌యం త‌మిళ‌నాడు పోలీసులు బెంగ‌ళూరులో త‌మ ఆదీనంలోకి తీసుకున్నారు.

ఆయ‌న‌పై మ‌లేషియాకు చెందిన ఓ మ‌హిళ‌పై అత్యాచారానికి పాల్ప‌డ‌టంతోపాటు గ‌ర్భస్రావం, బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మద్రాస్ హైకోర్టు మ‌ణికంద‌న్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో బెంగ‌ళూరులో ఉంటున్న మాజీ మంత్రిని చెన్నై న‌గ‌ర పోలీసులు ఇవాళ ఉద‌యం అరెస్టు చేశారు.

అన్నాడీఎంకే పార్టీ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న మ‌ణికంద‌న్ 2017 మే నెల‌లో ఓ మ‌లేషియా న‌టిని త‌మిళ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేశాడు. అప్ప‌టి నుంచి ఆయ‌న ఆ న‌టితో అక్ర‌మ సంబంధం కొన‌సాగిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

తమిళ నటి కూడా అయినా 36 ఏళ్ళ ఆ  ఫిర్యాదుపై అత్యాచారం, గర్భం కావించడం, మోసం చేయడం వంటి ఆరు ఆరోపణలపై చెన్నై అడయార్ లోని మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనది.  2019 వరకు తమిళనాడు ప్రభుత్వంలో ఐటి  మంత్రిగా ఉన్న ఆయనను విచారణకోసం పోలీసులు పిలిస్తే ఆయన హాజరు కాలేదు. 

మణికందన్ ను పట్టుకోవడానికి చెన్నై పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. మొదట్లో మధురై, రామనాథపురం లలో వెదికారు. అతని డ్రైవర్, సహాయకుడిని పిలిచి విచారించారు. 

తనతో ఐదేళ్ల పాటు సంబంధం ఏర్పాటు చేసుకొని, ఆ తర్వాత తనను ఈ మాజీ మంత్రి మోసం చేసాడని అంటూ ఆ నటి మే 28న చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనేకసార్లు తనపై దాడి చేసాడని, బలవంతంగా గర్భస్రావం చేయించాడని, తామిద్దరం కలసి ఉన్న ఫోటోలను ఆన్ లైన్ లో పెడతాను అంటూ బ్లాక్ మెయిల్ చేసాడని, చివరకు చంపుతాను అంటూ కూడా బెదిరించాడని ఆమె ఆరోపించారు. 

తాను మలేసియా టూరిజంలో పనిచేస్తుండగా ఇద్దరికీ స్నేహితుడైన ఒక వక్తి తనకు ఆ మంత్రితో పరిచయం చేసాడని అంటూ తన ఫిర్యాదు ప్రతిని, తామిద్దరి మధ్య జరిగిన వాట్స్ అప్ సంభాషణలను ఆమె మీడియా సమావేశంలో విడుదల చేశారు. 

మలేసియా స్టాక్స్ లో పెట్టుబడులు పెడతామని అంటూ తనతో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకున్నాడని, అప్పటికే అతనికి వివాహం జరిగినా తనను పెళ్లి చేసుకొంటానని మోసం చేసాడని ఆమె ఆరోపించారు. అయితే ఆమెవ్వరో తనకు తెలియదని, డబ్బుకోసం తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నదని ఇదివరలో ఒక తమిళ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆ మాజీ మంత్రి ఆరోపించారు.