సముద్ర గర్భ అన్వేషణకు రూ 4,077 కోట్లు

సముద్రపు అట్టడుగుపొరలలోని వనరులను అన్వేషించేందుకు రూపొందించిన డీప్ ఒషియన్ మిషన్‌కు కేంద్రం బుధవారం ఆమోదం తెలిపింది. వనరులను పసిగట్టడం, దీనికి సంబంధించి సముద్ర అంతర్భాగ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించుకోవడం జరుగుతుంది. సముద్ర వనరులను విరివిగా వాడుకునేందుకు ఈ మిషన్‌ను రూపొందించారు. 
 
దీనికి సంబంధించి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆ తరువాత విలేకరులకు తెలిపారు. సముద్ర జలాల వనరులకు సంబంధించిన నీలి ఆర్థిక వ్యవస్థను సరిగ్గా కాపాడుకోవడం, సరైన మద్దతు ఇవ్వడం ద్వారా భారత్‌ను మరింతగా ప్రగతిదాయక అధ్యాయంలోకి తీసుకుని పోవడం జరుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
సముద్ర అంతర్భాగాలలోని అపార జీవవైవిధ్యంపై మరింతగా అధ్యయనాలు జరుగుతాయని తెలిపారు. డీప్ ఓషియన్ మిషన్ రూపకల్పన ప్రతిపాదన భూ సంబంధిత శాస్త్ర వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి వెలువడిందని జవదేకర్ వివరించారు. రూ 4,077 కోట్ల వ్యయ అంచనాలతో కూడిన ఈ మిషన్ ఐదేళ్ల వరకూ అమలులో ఉంటుంది.