మెహుల్ చోక్సీ దస్తావేజుల గుట్టు బయటపెట్టిన సిబిఐ 

బ్యాంకులను మోసగించి, విదేశాలకు పారిపోయిన మెహుల్ చోక్సీ దస్తావేజుల గుట్టును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బయటపెట్టింది. చోక్సీ మేనేజర్లు ఆయన సంస్థలో పని చేసే సిబ్బంది పేరు మీద ముంబైలో అపార్ట్‌మెంట్లను అద్దెకు తీసుకుని, వాటిలో పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించడానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను రహస్యంగా భద్రపరిచినట్లు సీబీఐ తెలిపింది.

ఈ కేసులో 22 మంది నిందితులపై దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీటులో ఈ ఆరోపణలు చేసింది. మెహుల్ చోక్సీ (62) పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులతో కుమ్మక్కయి 165 లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్ఓయూ)లను, 58 ఫారిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎఫ్ఎల్‌సీ)లను పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

వీటిని బ్యాంకు అధికారులు 2017లో మోసపూరితంగా జారీ చేసినట్లు సీబీఐ ఆరోపించింది. వీటిని జారీ చేయడం వల్ల ఈ బ్యాంకుకు రూ.6,097 కోట్లు నష్టం జరిగిందని తెలిపింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీటును స్పెషల్ కోర్టు విచారణకు స్వీకరించింది. చోక్సీకి నాన్ బెయిలబుల్ వారంట్‌ను జారీ చేసింది.

చోక్సీ నేతృత్వంలోని గీతాంజలి గ్రూప్‌నకు గతంలో వైస్ ప్రెసిడెంట్‌గా పని చేసిన విపుల్ చితాలియా ఆదేశాల ప్రకారం అద్దె ఇళ్ళనుంచి డాక్యుమెంట్లను తరలించినట్లు సీబీఐ ఆరోపించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ గోకుల్‌నాథ్ రఘు షెట్టి  ఆ బ్యాంకులో భద్రపరచవలసిన పత్రాలను  మెహుల్ చోక్సీ కంపెనీలకు అప్పగించేశారని సీబీఐ పేర్కొంది.

ఆ పత్రాలను 2018 ఫిబ్రవరి 5న భీమ్‌రావ్ వాడిలోని ఓ దుకాణంలోకి తరలించారని తెలిపింది. ఈ దుకాణాన్ని చితాలియా ఆదేశాల మేరకు అద్దెకు తీసుకున్నారని తెలిపింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిర్వహించిన సోదాల్లో ఈ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. 

మోసపూరితంగా సంపాదించిన ఎల్ఓయూలు, ఎఫ్ఎల్‌సీలను చోక్సీ ఆదేశాల మేరకు గూగుల్ డ్రైవ్‌లో చితాలియా రికార్డు చేశారని తెలిపింది. క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరుగుతాయని ఊహించినందువల్లే చోక్సీ 2018 జనవరి 4న దేశం విడిచి పారిపోయారని పేర్కొంది. చట్టం నుంచి తప్పించుకోవాలనే దురుద్దేశంతోనే ఆయన పారిపోయారని పేర్కొంది.