టీకా డోస్ కు ముందుగా నమోదు అక్కర్లేదు

కొవిడ్‌-19 టీకాలను పొందటానికి ప్రీ-రిజిస్ట్రేషన్ లేదా అపాయింట్‌మెంట్ బుకింగ్ తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం  ప్రకటించింది. టీకాలు తీసుకోవ‌డంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారని నివేదిక‌లు అందిన తర్వాత ఈ మేర‌కు కేంద్రం నిర్ణ‌యం తీసుకున్న‌ది.

18 ఏండ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా నేరుగా సమీప టీకాల కేంద్రానికి వెళ్లి అక్కడ టీకా ఆన్-సైట్ రిజిస్ట్రేషన్ చేసుకుని వ్యాక్సిన్ డోసు పొంద‌వ‌చ్చు. కామన్ సర్వీస్ సెంటర్స్ (సీఎస్‌సీ) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవ‌డం కో-విన్‌లో రిజిస్ట్రేషన్ సులభతరం చేసే అనేక రీతుల్లో ఒకటి అని కేంద్రం వివరించింది.

ఆరోగ్య కార్యకర్తలు లేదా ఆశా కార్య‌క‌ర్త‌లు గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులను, పట్టణ మురికివాడల్లో నివసించేవారిని ఆన్-సైట్ రిజిస్ట్రేషన్, టీకాల కోసం నేరుగా సమీప టీకా కేంద్రాలలో సమీకరించ‌నున్నారు. 1075 హెల్ప్ లైన్ ద్వారా అసిస్టెడ్ రిజిస్ట్రేషన్ల సౌకర్యం కూడా అమలు చేయనున్నారు.

ఈ నెల‌13 వ తేదీ నాటికి కో-విన్‌లో నమోదైన 28.36 కోట్ల మంది లబ్ధిదారుల్లో 16.45 కోట్ల (58 శాతం) లబ్ధిదారులు ఆన్-సైట్ మోడ్‌లో నమోదు చేసుకున్నారు. అలాగే జూన్ 13 నాటికి కో-విన్‌లో నమోదైన మొత్తం 24.84 కోట్ల వ్యాక్సిన్ మోతాదుల్లో 19.84 కోట్ల డోసులను (దాదాపు 80 శాతం) ఆన్‌సైట్ / వాక్-ఇన్ టీకా ద్వారా అందించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొన్న‌ది.

ఇలా ఉండగా,  దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా  వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మాత్రం నిరంత‌రాయంగా కొనసాగుతున్న‌ది. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 1.05 కోట్ల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వచ్చే మూడు రోజుల్లో మరో 47 లక్షలకు పైగా డోసులను రాష్ట్రాలకు పంపనున్నట్లు  తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రాలకు ఉచితంగా 25 కోట్లకు పైగా (26,69,14,930) వ్యాక్సిన్‌ డోసులను అందించింది. వాటిలో జూన్‌ 14 వరకు 25,67,21,069 డోసులను అందించారు. అవి కాకుండా ప్రస్తుతం 1,05,61,861 వ్యాక్సిన్లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద అందుబాటులో ఉన్నాయి. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రాలకు తోడుగా ఉండేందుకు కేంద్రం వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తున్న‌ది.