గాల్వాన్ అమరవీరులకు జాతి ఘన నివాళి 

వాస్తవాధీన రేఖ వెంబడి లడక్ గల్వాన్ లోయలో గత ఏడాది జూన్ 15న చైనా బలగాలు కుట్రపూరితంగా   భారత సైన్యంపై దాడి చేశాయి. కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లు చైనా బలగాల దాడిని తిప్పికొడుతూ అమరులయ్యారు. భారత సైనికుల ప్రతిదాడిలో పెద్ద సంఖ్యలో తమ సైన్యం చనిపోయినా చైనా పీపుల్స్ ఆర్మీ మాత్రం ఒప్పుకోలేదు.

 ప్రపంచ మీడియా కోడై కూసినా చాలా కాలం చైనా మాత్రం ఒప్పుకోలేదు. ఘటన జరిగిన ఆరేడు నెలల తర్వాత చనిపోయింది వీరేనంటూ ఐదుగురు సైన్యాధికారులు, సైనికుల చిత్రపటాలను చైనా అధికారిక మీడియా ప్రసారం చేసింది. పూర్తి స్థాయిలో జరిగిన నష్టాన్ని మాత్రం ఒప్పుకోలేదు. అయితే భారత బలగాల సత్తా ఏంటో చైనాకు తెలిసివచ్చింది.

చైనా కుట్ర పూరిత దాడి తర్వాత భారత సైన్యం అప్రమత్తమైంది. వ్యూహాత్మకంగా ఎత్తైన స్థావరాలకు ముందుగా చేరుకుని చైనా బలగాలకు చెక్ పెట్టింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా చైనా సైన్యం కుట్రపూరిత దాడిపై సీరియస్ అయింది. ఫ్రాన్స్ నుంచి రావాల్సిన రఫెల్ యుద్ధ విమానాలను యుద్ధ ప్రాతిపదికన రప్పించుకుంది.

చైనా యాప్‌లను నిషేధించింది. చైనాతో వ్యాపార, వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంది. బాయ్‌కాట్ చైనా అంటూ ప్రజల్లో కూడా సెంటిమెంట్ రావడంతో చైనా ఉత్పత్తులకు గిరాకీ పడిపోయింది. భారత ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా మండిపడుతుండటంతో చైనా తదుపరి చర్చలు జరగాల్సిందేనని పట్టుబట్టింది. 

ఆ తర్వాత ముందుకు చొచ్చుకువచ్చిన తమ బలగాలను చైనా వెనక్కు పిలిపించుకుంది. అంతేకాదు వాస్తవాధీన రేఖ వెంబడి నిర్మించిన నిర్మాణాలను కూడా కూల్చివేసింది. రెండు దేశాల మధ్య సైన్యాధికారుల స్థాయి చర్చలు అనేక దఫాలుగా జరుగుతునే ఉన్నాయి. 

ఇటు లడక్‌లో ఉన్న శీతల వాతావరణం పడక అనేకమంది చైనా సైనికులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వేలాది మంది తమ సైనికులను చైనా ఎప్పటికప్పుడు మారుస్తూ వచ్చింది. ఓ పక్క వుహాన్‌లో తయారైన కొవిడ్ వైరస్ భారత్‌‌ను సంక్షోభంలోకి నెట్టేయగా, మరోపక్క అదే సమయంలో చైనా భారత సైన్యంపై కుట్రపూరిత దాడి చేయడాన్ని భారతీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

నేటికీ ఎల్‌ఏసీ వద్ద చైనా బలగాల కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి. దీంతో భారత సైన్యం పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉంది. గల్వాన్ ఘటన జరిగి ఏడాదైన సందర్భంగా అమరవీరులకు జాతి ఘనంగా నివాళులర్పించింది. 

గల్వాన్ అమరవీరుల స్థూపం వద్ద సైన్యాధికారులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. తెలంగాణ సూర్యాపేటలో కల్నల్ సంతోష్‌బాబు కాంస్య విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. సోషల్ మీడియాలో నెటిజన్లు గల్వాన్ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ పోస్టులు పెట్టారు.