
బంగారు నగలపై మంగళవారం నుండి కేంద్రం హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసింది. నగల వ్యాపారుల మోసాలకు చెక్ పెట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు హాల్‌మార్కింగ్ విధానాన్ని స్వచ్ఛందంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
హాల్ మార్కింగ్ తప్పనిసరి చేయడంతో అధిక స్వచ్ఛత పేరుతో నాసిరకం నగలను కొనుగోలుదారులకు విక్రయించేందుకు అవకాశం లేకుండా వారి మోసాలకు అడ్డుకట్ట పడనుంది. అయితే ఈ విధానాన్ని ఈ ఏడాది ప్రారంభం నుండి అమలు చేయాలని కేంద్రం భావించింది. అనంతరం జూన్1కు వాయిదా వేశారు.
కరోనా సెకండ్ వేవ్ ఉథృతి నేపథ్యంలో ఈ విధానాన్ని ఏడాది పాటు వాయిదా వేయాలని నగల వ్యాపారుల సంఘం కేంద్రాన్ని కోరింది. అయితే కేంద్రం ఈ విజ్ఞప్తులను తోసిపుచ్చింది. 15 రోజులు మాత్రమే పొడిగించింది. దీంతో నేటి నుండి ఈ విధానం అమల్లోకి రానుంది.
ఇకపై నగల వ్యాపారులు హాల్‌మార్క్ ఉన్న 14,18,22 క్యారెట్ల నగలను మాత్రమే విక్రయించాల్సి వుంటుంది.
కాగా, బంగారు నగలకు ‘హాల్‌మార్క్’ ప్రమాణాలను భారతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ (బిఐఎస్) 20 ఏళ్ల క్రితమే నిర్ణయించింది. సంఘటిత రంగంలోని కొన్ని జువెలరీ సంస్థలతో పాటు కొంతమంది నగల వ్యాపారులు వీటిని స్వచ్ఛందంగా అమలు చేస్నున్నారు.
అసంఘటిత రంగంలోని నగల వ్యాపారులు మాత్రం ఈ నిబంధనను బేఖాతరు చేస్తున్నారు. అయితే దేశంలో ఇంకా సరిపడా హాల్‌మార్కింగ్ మౌలిక సదుపాయాలు లేవని ఈ వ్యాపారులు అంటున్నారు. నగలోని బంగారం స్వచ్ఛతను హాల్‌మార్క్ తెలుపుతుంది. నగలతో పాటు బంగారంతో రూపొందించిన కళాత్మక వస్తువులపై కూడా ఈ చిహ్నం ఉండాలని కేంద్రం పేర్కొంది. అలాగే బిల్లులో కూడా నగ ఎన్ని క్యారట్లు అనే వివరాలుండాలని సూచించింది.
నగలు కొనేటప్పుడు గుర్తుంచుకోండి
- హాల్‌మార్కింగ్ నగలోని బంగారం స్వచ్ఛతకు చిహ్నం
- మంగళవారం నుంచి వ్యాపారులు 14, 18, 22 క్యారట్ల నగలు మాత్రమే విక్రయించాలి
- బంగారంతో చేసే కళాత్మక వస్తువులకు కూడా హాల్‌మార్కింగ్ చిహ్నం తప్పనిసరి నగపైనే కాకుండా వ్యాపారులు ఇచ్చే బిల్లులోనూ ఎన్ని క్యారట్లు, హాల్‌మార్కింగ్ వివరాలు ఉండాలి
- ప్రతి నగపై తప్పనిసరిగా బీఐఎస్ గుర్తు, నగలో బంగారం శాతాన్ని తెలిపే 14, 8, 22 క్యారట్ల వివరాలు ఉండాలి
- హాల్‌మార్కింగ్ కేంద్ర గుర్తింపును తెలిపే సంఖ్య, నగల వ్యాపారి గుర్తింపు సంఖ్య కూడా నగపై ఉంటుంది.
More Stories
కర్రెగుట్టలో చివరి ఘట్టంలో ఆపరేషన్ కగార్?
దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడమే హిందూ మతం
ఆర్మీ హిట్ లిస్ట్ లో 14 మంది ఉగ్రవాదులు!