అయోధ్య ట్రస్ట్ పై అసత్య ఆరోపణలు… పరువునష్టం దావా

అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం జరిగిన స్థలం కొనుగోలు విషయంలో  శ్రీ రామజన్మభూమి తీర్థ్ ట్రస్ట్, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పై రెండు రాజకీయ పార్టీల నేతలు బాధ్యతా రహితంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని విశ్వ హిందూ పరిషద్ జాతీయ సంయుక్త కార్యదర్శి వై రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసత్య ఆరోపణలు చేస్తున్నవారు క్షమాపణలు చెప్పినా ఊరుకోమని, వారిపై పరువు నష్టం దావా వేయబోతున్నామని ఆయన హైదరాబాద్ లో మీడియా సమావేశంలో వెల్లడించారు. అన్ని లావాదేవీలు బ్యాంకు ద్వారానే జరిగినాయని, ఎక్కడ నగదు ద్వారా జరగలేదని ఆయన స్పష్టం చేశారు.

అయోధ్య రైల్వే స్టేషన్ దగ్గరున్న స్థలాన్ని తీర్థక్షేత్ర ట్రస్ట్ తీసుకుందామని భావించిందని, అందులో భాగంగా దాని యజమాని కుసుమ పాఠక్, అలాగే ఆమె దగ్గర నుంచి అంతకుముందే కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న సుల్తాన్ అన్సారీలతో సంప్రదించిందని తెలిపారు.

గతంలో ఆ భూమి విలువ రూ.2 కోట్లు కాగా,  ఉత్తరప్రదేశ్‌లో నేటి మార్కెట్ విలువ ప్రకారం రూ 20 కోట్లు వరకు ఉంటుందని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసినదని ఆయన చెప్పారు. అన్ని వివరాలు సేకరించిన తర్వాతనే రూ 18.5 కోట్లకు కొనుగోలు చేశామని పేర్కొన్నారు. 

ఈ రెండు లావాదేవీలు ఒకదాని, తర్వాత జరుగవలసి ఉన్నందున అందుకు అవసరమైన  స్టాంప్ పేపర్ లను ఒకే వ్యక్తి తీసుకున్నాడని తెలిపారు. అందుచేత ఏది ముంది, ఏది తర్వాత అనే అనుమానాలకు ఇక్కడ ఆస్కారం లేదని రాఘవులు స్పష్టం చేశారు. 

శ్రీరామ జన్మభూమిలో రామాలయం నిర్మాణాన్ని అడ్డుకోవడానికి చాలాకాలంగా ప్రయత్నిస్తున్న రాజకీయ నాయకులు ఇప్పుడు  పనికట్టుకొని ఇప్పుడు మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. విశ్వ హిందూ పరిషద్ తెలంగాణ అధ్యక్షులు రామరాజు, రాష్ట్ర కార్యదర్శి బండారి రమేశ్, అధికార ప్రతినిధి శశిధర్ కూడా పాల్గొన్నారు.