అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ లపై సీసీఐ విచార‌ణ వేగవంతం 

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ లపై సీసీఐ విచార‌ణ వేగవంతం 

ఈ-కామ‌ర్స్ ఫ్లాట్‌ఫామ్‌లో వ్యాపారం నిర్వ‌హిస్తున్న అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ సంస్థ‌ల‌పై ద‌ర్యాప్తును వేగ‌వంతం చేయ‌నున్న‌ట్లు కాంపిటీష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా పేర్కొన్న‌ది. మార్కెట్‌లో పోటీత‌త్వాన్ని అణ‌గ‌దొక్కేందుకు.. ఎంపిక చేసిన అమ్మ‌కందారుల‌ను మాత్ర‌మే ఈ రెండు సంస్థ‌లు ప్ర‌మోట్ చేశాయ‌ని, వారికి మాత్ర‌మే భారీ డిస్కౌంట్లు ఇస్తున్న‌ట్లు టెకీ సంస్థ‌లపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 

ఆ ఫిర్యాదుల‌పై జ‌న‌వ‌రిలోనే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ సంస్థ‌ల‌పై సీసీఐ విచార‌ణ ప్రారంభించింది. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం కొత్త ఐటీ చ‌ట్టాల‌ను తీసుకురావ‌డంతో మ‌ళ్లీ ఆ విచార‌ణ‌ను వేగ‌వంతం చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే కొత్త ఐటీ రూల్స్‌ను ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ సంస్థ‌లు వ్య‌తిరేకిస్తున్న విష‌యం తెలిసిందే. 

కానీ ఆన్‌లైన్ మార్కెట్‌లో అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌పై గ‌తంలో ఫిర్యాదు అందాయి. ఆ ఫిర్యాదుల ఆధారంగా సీసీఐ ద‌ర్యాప్తు ప్రారంభించింది. అయితే రెండు సంస్థ‌లు కోర్టుల‌ను ఆశ్ర‌యించ‌డంతో  త ఏడాది నుంచి విచార‌ణ నిలిచిపోయింది. కోర్టు అనుమ‌తి ఇవ్వ‌డంతో మ‌ళ్లీ విచార‌ణ‌ను చేప‌ట్ట‌నున్నారు.

వీలైనంత త్వ‌ర‌గా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుంచి స‌మాచారాన్ని సేక‌రించ‌నున్న‌ట్లు సీసీఐ పేర్కొన్న‌ది. పెద్ద పెద్ద టెక్నాల‌జీ కంపెనీల‌పై ఉన్న కేసుల విచార‌ణ‌ను వేగ‌వంతం చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఇటీవ‌ల సీసీఐ వెల్ల‌డించింది. కేసుల ప‌రిష్కారం కోసం అద‌న‌పు ఆఫీస‌ర్ల‌ను రిక్రూట్ చేయ‌నున్నారు. డిజిట‌ల్ సంస్థ‌ల‌పై ఉన్న‌కేసుల‌ను సీసీఐ ప‌రిశీలిస్తున్న‌ద‌ని, ఈ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం వ‌ల్ల దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌, స్టార్ట‌ప్స్‌పై ప్ర‌భావం ఉంటుంద‌ని ఓ అధికారి అన్నారు.