మసీద్ లలో అరబ్ కాకుండా తమిళ్ చదువుతారా!

హిందూ దేవాలయాలలో తమిళ్ లో పూజలు జరపాలని తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం నిర్ణయించడంను  రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీనివాసన్  స్వాగతించారు. అయితే మసీద్ లలో అరబ్ లో కాకుండా తమిళ్ లేదా మరే భాష అయినా వాడేటట్లు ఈ ప్రభుత్వం చేయగలదా అని ఆయన ప్రశ్నించారు. 

తమిళనాడులో ఏ మసీద్ లోకి కూడా మహిళలను అనుమతించరని ఆయన గుర్తు చేశారు. అదే విధంగా రాష్ట్రంలోని ఏ చర్చి లో కూడా మహిళా పూజారులు లేరని కూడా తెలిపారు. దేవాలయాలలో తమిళ్ లో పూజలు జరపడం ఏదో కొత్తగా చేస్తున్నట్లు డీఎంకే ప్రభుత్వం పేర్కొనడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక హిందూ దేవాలయాలలో తమిళ్ లో పూజలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 

అదే విధంగా అన్ని కులాలవారిని పూజార్లుగా అనుమతించడం, మహిళలను పూజారులుగా అనుమతించడం ఇప్పుడేదో కొత్తగా చేస్తున్నట్లు ఈ ప్రభుత్వం పేర్కొనడం పట్ల ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఇటువంటి సంప్రదాయాలు ఉన్నాయని చెప్పారు. పొరుగున ఉన్న కేరళలో ఈ విధమైన పద్దతిని ప్రవేశపెట్టారని తెలిపారు. 

హిందూ దేవాలయాలలో సంస్కరణల పట్ల అంతగా ఆసక్తి ఉంటె గత 50 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ద్రావిడ పార్టీలు ఎందుకని అటువంటి ప్రయత్నం చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. మసీదులు, చర్చి లలో ఇటువంటి సంస్కరణలు తీసుకు రాగలరా అని నిలదీశారు.