డీఎంకేకు తొలి మూడు నెలలపాటు హనీమూన్‌

డీఎంకేకు తొలి మూడు నెలలపాటు హనీమూన్‌

తమిళనాడులో రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన డీఎంకేకు తొలి మూడు నెలలపాటు హనీమూన్‌ కాలమని, అందువల్ల మూడు నెలలపాటు ఆ పార్టీ పాలనపై ఎలాంటి విమర్శలు చేయబోమని సినీ నటి, బీజేపీ మహిళా నేత ఖుష్బూ ప్రకటించారు. సాధారణంగా కొత్తగా పెళ్ళయిన దంపతులకు తొలి మూడు నెలలు హనీమూన్‌లాంటిదని ఆమె గుర్తు చేశారు. 

అదే పరిస్థితి డీఎంకేకు ఉందని ఆమె తెలిపారు. ఇదివరకు  అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో లాక్‌డౌన్‌ సమయం లో మద్యం దుకాణాలు తెరవడాన్ని డీఎంకే అధ్యక్షుడి హోదాలో స్టాలిన్‌ తీవ్రంగా ఖండిచారని ఖుష్బూ  గుర్తు చేశారు. కానీ, ఇపుడు ముఖ్యమంత్రి కాగానే ఆయన లాక్‌డౌన్‌ పట్టించుకోకుండా మద్యం దుకాణాలను తెరిచారని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. 

అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలు,  ప్రభుత్వంకు వ్యతిరేకంగా జరిపిన నిరసన ప్రదర్శనలను స్టాలిన్ మరిచిపోయారా అనే ఆమె ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒక మాట, విపక్షంలోకి వచ్చినపుడు మరో మాట మాట్లాడటం స్టాలిన్‌కే చెల్లిందని ఆమె చురకలు అంటించారు.

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోది రేయింబవళ్ళు శ్రమిస్తున్నారని ఆమె కొనియాడారు. ఒక్క మనదేశ ప్రజలనే కాకుండా, ప్రపంచ ప్రజల ప్రాణాలు రక్షించేందుకు వీలుగా ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేశారని బిజెపి నేత గుర్తు చేశారు. 

అలాగే, రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో మహిళలకు అర్చకత్వం ఇవ్వడంపై ఆమె స్పందిస్తూ, ఈ ఆచారం ఇపుడు కొత్తగా వచ్చింది కాదని ఆమె స్పష్టం చేశారు. అనాది కాలం నుంచి అనేక ఆలయాల్లో మహిళలు అర్చకులుగా పనిచేశారని ఖుష్బూ పేర్కొన్నారు.