ట్వీట్లతో విషం చిమ్ముతున్న రాహుల్ 

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ త‌న ట్వీట్ల‌తో స‌మాజంలో విషం చిమ్ముతున్నార‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య‌నాథ్ విమ‌ర్శించారు. ఇటీవ‌ల యూపీలో ఓ ముస్లిం వ్య‌క్తిపై దాడి జ‌రిగింది. జైశ్రీరామ్ అని ప‌ల‌క‌నందుకు అత‌నిపై దాడి చేశార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంట్లో మ‌త కోణం ఉందంటూ రాహుల్ ఆరోపించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

కానీ ఆ ఘ‌ట‌న‌లో ఎటువంటి మ‌తప‌ర‌మైన‌ కోణం లేద‌ని పోలీసులు తేల్చారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. పోలీసులు చెప్పినా రాహుల్ మాత్రం నిజం మాట్లాడ‌డం లేద‌ని, ఆయ‌న‌కు స‌త్యం మాట్లాడ‌డం తెలియ‌ని యోగి ఎద్దేవా చేశారు.

రాహుల్ ట్వీట్ల‌కు కౌంటర్ ఇచ్చిన యోగి.. శ్రీరాముడు తొలుత నేర్చుకున్న‌ది స‌త్యం మాట్లాడ‌టం అని హితవు చెప్పారు. అది మీరు మీ జీవితంలో ఎప్పుడూ చేయ‌లేని రాహుల్‌ను విమ‌ర్శించారు. స‌మాజంలో విషాన్ని వ్యాపింప‌చేస్తున్నార‌ని, అధికారం కోసం మాన‌వ‌త్వాన్ని మ‌రిచిపోతున్నార‌ని కాంగ్రెస్ నేత‌పై యూపీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముస్లిం వృద్ధుడిపై దాడి చేయ‌డం స‌మాజానికి, మ‌తానికి సిగ్గు చేటు అని అంత‌క‌ముందు రాహుల్ ట్వీట్ చేశారు. నిజ‌మైన శ్రీరాముడి భ‌క్తులు ఇలా చేసి ఉంటార‌ని అనుకోవ‌డం లేద‌ని రాహుల్ అన్నారు.