టిడిపితో తిరిగి పొత్తు ప్రసక్తి లేదు: బీజేపీ

రాజకీయంగా ఏ అంశంలోనూ తెలుగుదేశం పార్టీతో తిరిగి కలిసే ప్రసక్తి లేదని బీజేపీ రాష్ట్ర శాఖ మరోసారి స్పష్టం చేసింది. ఆదివారం విజయవాడలో జరిగిన పార్టీ కోర్ కమిటీ చర్చల వివరాలను పార్టీ ఎమ్యెల్సీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్ మీడియాకు తెలిపారు. 

 చంద్రబాబు ఎన్ని కుయుక్తులకు పాల్పడినా ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఎట్టి పరిస్థితులలో జరగదని తేల్చి చెప్పింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో జరిగిన బీజేపీ కోర్‌ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి పి.మురళీధరన్ పాల్గొన్నారు. 

జాతీయ సంఘటనా సంయుక్త కార్యదర్శి శివప్రకాశ్, జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌చార్జి సునిల్‌ దియోధర్, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తదితరులు  కూడా పాల్గొన్నారు.

ఈనెల 21న యోగా దినోత్సవంతో పాటు మరికొన్ని కార్యక్రమాలు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు మాధవ్  చెప్పారు. 28న రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు వర్చువల్‌ విధానంలో జరుగుతాయని తెలిపారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు చర్చకు వచ్చినట్టు ఆయన తెలిపారు.

రైతుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర  ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సమావేశం విమర్శించింది. కరోనాతో పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై ఆస్థి పన్ను, చెత్త పన్ను అంటూ అడ్డదారిలో ప్రజలపై పెనుభారం వేస్తూ చెత్త నిర్ణయాలు తీసుకోవడం సిగ్గు చేటని ధ్వజమెత్తింది.

ప్రజలపై పెను భారానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, జనసేన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు మాధవ్ వెల్లడించారు. రాబోయే రోజులలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేయటంలో కార్యకర్తలు చురుకైన పాత్ర వహించేటట్లు చూడాలని నిర్ణయించారు.

 విశాఖ భూ అక్రమాలపై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదో సమాధానం చెప్పాలని బిజెపి డిమాండ్‌ చేసింది.  అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా పెట్రోల్, గ్యాస్‌ ధరలు పెరుగుతున్నట్టు చెప్పారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు.