భారత సంతతి జర్నలిస్ట్‌కు పులిట్జర్‌ పురస్కారం 

భారత సంతతికి  చెందిన జర్నలిస్ట్ మేఘ రాజగోపాలన్ ప్రతిష్టాత్మక పులిట్జర్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. మరో ఇద్దరితో కలిసి  ఆమె ఈ పురస్కారాన్ని గెలుచుకున్నారు. 
 
చైనాలోని జిన్జియాంగ్‌ ప్రాంతంలో రహస్యంగా వందలాది జైళ్లు, నిర్బంధ శిబిరాలు నిర్మించి.. వేలాది మంది ముస్లింలను అదుపులోకి తీసుకుని., చిత్ర హింసలకు గురి చేస్తోన్న విషయాలను వెల్లడించినందుకు మేఘ రాజగోపాలన్‌ ఈ బహుమతి గెలుచుకున్నారు. పులిట్జర్‌ ప్రైజ్‌ గెలుచుకున్న ఇద్దరు భారత సంతతి జర్నలిస్టులలో అమెరికా  బజ్‌ఫీడ్ న్యూస్‌కు చెందిన ఎంఎస్ రాజగోపాలన్ ఒకరు. ఈమె ప్రచురించిన జిన్జియాంగ్ సిరీస్ అంతర్జాతీయ రిపోర్టింగ్ విభాగంలో పులిట్జర్ బహుమతిని గెలుచుకుంది. 
2017లో, జిన్జియాంగ్‌ లో చైనా వేలాది మంది ముస్లింలను అదుపులోకి తీసుకోవడం ప్రారంభించిన కొద్దికాలానికే, రాజగోపాలన్ ఒక నిర్బంధ శిబిరాన్ని సందర్శించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. తమ దేశంలో అటువంటి ప్రదేశాలు లేవని చైనా ఖండించిన సమయంలో, బజ్‌ఫీడ్ న్యూస్ ఈ విషయాన్ని వెల్లడించింది.
“మేఘ రాజగోపాలన్‌ జిన్జియాంగ్‌ ప్రాంతంలో సందర్శించిందని గుర్తించిన వెంటనే చైనా ప్రభుత్వం ఆమె నోరు మూయించేందుకు ప్రయత్నించింది, ఆమె వీసాను సస్పెండ్‌ చేయడమే కాక దేశం నుంచి వెళ్లిపోవాలని బెదిరించింది” అని బజ్‌ఫీడ్‌ న్యూస్ బహుమతి కోసం పంపిన తన ఎంట్రీలో వెల్లడించింది.

డ్రాగన్‌ బెదిరింపులకు భయపడని మేఘన మరో ఇద్దరి సాయంతో లండన్ నుంచి పనిచేయడం ప్రారంభించారు. వీరిలో ఒకరు అలిసన్ కిల్లింగ్, లైసెన్స్ పొందిన ఆర్కిటెక్చర్‌, భవనాల ఉపగ్రహ చిత్రాల ఫోరెన్సిక్ విశ్లేషణలో నైపుణ్యం కలిగినవాడు కాగా, మరొకరు క్రిస్టో బుస్చెక్ డాటా జర్నలిస్టుల కోసం టూల్స్‌ రూపొందించే ప్రోగ్రామర్. 

ఈ ముగ్గురి బృందం చైనా సెన్సార్‌ చేసిన వేలాది ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి అక్కడ జరుగుతున్న అరాచకాలను ప్రపంచానికి వెల్లడించారు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న మేఘన పులిట్జర్‌ గెలవడంపై స్పందిస్తూ.. ‘‘ఈ అవార్డు గెలుచుకుంటానని తాను అస్సలు ఊహిచలేదని.. పూర్తిగా షాక్‌లో ఉన్నాను’’ అన్నారు మేఘన.