ఫిల్మ్ మేక‌ర్ అయిషా సుల్తానాపై దేశ‌ద్రోహం కేసు 

ల‌క్ష‌ద్వీప్‌కు చెందిన  చిత్ర నిర్మాత, దర్శకురాలు, మోడల్‌, నటి, సామాజిక కార్య‌క‌ర్త‌ అయిషా సుల్తానాపై ఇవాళ దేశ‌ద్రోహం కేసు న‌మోదు అయ్యింది. విద్వేష‌పూరితంగా మాట్లాడిన‌ట్లు కూడా ఆమెపై కేసు నమోదు చేశారు. కావ‌ర‌ట్టి పోలీసు స్టేష‌న్‌లో కేసు నమోదు అయింది. 

ఓ టీవీ చ‌ర్చ‌లో పాల్గొన్న ఆమె ల‌క్ష‌ద్వీప్ ప్ర‌జ‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం కోవిడ్19ను జీవాయుధంగా వ‌దిలిన‌ట్లు ఆరోపించారు. ల‌క్ష‌ద్వీప్‌లో ఉన్న కేంద్ర పాలిత ప్రాంత అడ్మినిస్ట్రేట‌ర్ ప్రఫుల్ ప‌టేల్‌ను ఆమె బ‌యోవెప‌న్ అని సంబోధించారు.  ఆయన రాక ముందు తమ దీవిలో ఒక్క కరోనా కేసు కూడా లేదని, ఇపుడు రోజూ వంద కరోనా కేసులు బయటపడ్డాయని ఆమె ఆరోపించారు. 

బీజేపీ లక్షదీప్  అధ్య‌క్షుడు సీ అబ్దుల్ ఖాదిర్ హ‌జీ దేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆమెపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేశారు. మలయాళం టివి ఛానల్ ‘మీడియా వన్ టివి’లో ఆమె ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన వాఖ్యాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ వాఖ్యల పట్ల లక్షదీప్ లోని బిజెపి కార్యకర్తలు వీధుల్లో నిరసన తెలిపారు.

సెడిష‌న్ సెక్ష‌న్ 124ఏ కింద ఆమెపై కేసు నమోదు చేశారు. ఇటీవ‌ల మీడియావ‌న్‌టీవీ అనే మ‌ళ‌యాళీ ఛాన‌ల్‌తో సుల్తానా మాట్లాడుతూ ల‌క్ష‌దీవుల‌పై ప్ర‌ఫూల్ ప‌టేల్‌ను కేంద్రం ఓ జీవాయుధంగా వాడుతున్న‌ట్లు ఆరోపించారు.

లక్షద్వీప్ లో ప్రఫుల్ పటేల్ తీసుకు వస్తున్న పాలన సంస్కరణల పట్ల, నూతన చట్టాల ప్రతిపాదనల పట్ల వ్యతిరేకంగా  అక్కడ,కేరళలో జరుగుతున్న నిరసనలలో ఆమె క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. తన పేస్ బుక్ పోస్ట్ లో తన వివాదాస్పద వాఖ్యాలను ఆమె ఈ విధంగా సమర్ధించుకున్నారు: 

” జీవాయుధం అనే పదాన్ని నేను టివి  డిబేట్ లో వాడాను. పటేల్, ఆయన రాజకీయాలు జీవాయుధంగా మారాయని నేను భావిస్తున్నాను. ఆయన ద్వారానే లక్షద్వీప్ లో కరోనా వ్యక్తి చెందింది. నేను పటేల్ ను జీవాయుధం  అన్నాను గాని ప్రభుత్వాన్ని లేదా దేశాన్ని కాదని మీరు అర్ధం చేసుకోవాలి. ఆయనను ఇంకేమని పిలవాలి?”

పటేల్ ప్రతిపాదిస్తున్న సంస్కరణలను ఈ ద్వీపంలో నివసించే ప్రజల సంక్షేమం, భద్రతకోసం ఉద్దేశించినవని, పైగా దీనిని మాల్దీవిస్ వలే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం కోసం అని లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టం చేస్తున్నది. అయితే స్థానికంగా కొందరు తమ సాంస్కృతిక, సామజిక జీవనంపై దాడిగా భావిస్తున్నారు.