విదేశీ బహుళజాతి సంస్థలను బహిష్కరించాలని దేశవాసులకు యోగ గురువు బాబా రామ్‌దేవ్ విజ్ఞప్తి చేశారు. ఈ కంపెనీలు వ్యాపారం పేరిట దోపిడీలు, దారుణాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. స్వదేశీ వస్తువులను విరివిగా ఉపయోగించడం ద్వారా విదేశీ సంస్థల మోసాలను అరికట్టవచ్చని సూచించారు.
ఈ మేరకు ఆయన తన ఆలోచనలను మంగళవారం ఇంటర్నెట్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. పతంజలి దేశాన్ని కుటుంబంగా చూసుకుంటున్నదని, వైద్యం చేసే స్ఫూర్తితో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నామని బాబా రాందేవ్ తెలిపారు.
ఈ విదేశీ బహుళజాతి కంపెనీల ముసుగులో, ఒత్తిడిలో కొంతమంది పతంజలి సంస్థ పరువు తీస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వాటికి తామెప్పుడూ భయపడమని స్పష్టం చేశారు. త్వరలో పతంజలి సంస్థ దేశంలోనే అతిపెద్ద ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ సంస్థగా అవతరించనున్నదని బాబా రామ్‌దేవ్ వెల్లడించారు.
ఎమ్మెన్సీల నల్ల వ్యాపారాన్ని అంతం చేస్తామని తేల్చి చెప్పారు. బ్రాండెడ్ వస్తువుల పేరిట చాలా కంపెనీలు ఔషధాలను అసలు ధరల కంటే చాలా రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నందునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్ ఔషధి కేంద్రాలను తెరవవలసి వచ్చిందని తెలిపారు. ఈ దోపిడీ తనను బాధపెడుతుందని బాబా ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో ఆహారం, పానీయాలపై దృష్టి పెట్టడంతో పాటు యోగా చేయాలని ఆయన సాధారణ ప్రజలకు పిలుపునిచ్చారు.
More Stories
సంచలన ఆరోపణలు చేసే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూసివేత
భారత్‌కు క్షమాపణలు చెప్పిన మెటా సంస్థ
కేజ్రీవాల్‌పై ఈడీ విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్