కొవిషీల్డ్ రూ.780, కొవాగ్జిన్ రూ.1410

ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొవిడ్ టీకాలకు సంబంధించి కొవిషీల్డ్ టీకా రూ.780, కొవాగ్జిన్ టీకా రూ.1,410 ల వరకు ధర వసూలు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రష్యా టీకా స్పుత్నిక్ వి ధర 1,145 గా నిర్ణయించింది.

ప్రైవేట్ ఆస్పత్రుల్లో సర్వీస్ ఛార్జీలు రూ.150కు మించి లేకుండా చూడాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. కరోనా వైద్య చికిత్సలకు సంబంధించి ప్రైవేట్ ఆస్పత్రులను నిరంతరం పర్యవేక్షించాలని కూడా సూచించింది. ఇంతకన్నా ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

మరోవంక, దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికి జూన్‌ 21 నుంచి ఉచితంగా టీకా అందించనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన తర్వాత  దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ కంపెనీలకు భారీ ఆర్డరును ఇచ్చింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా పుణెకు చెందిన సీరం సంస్థకు 25 కోట్ల కోవిషీల్డ్‌ డోసులను ఆర్డర్‌ ఇచ్చింది.

దాంతో పాటుగా భారత్‌ బయోటెక్‌ కంపెనీకి 19 కోట్ల కోవాగ్జిన్‌ డోసులను కేంద్ర ప్రభుత్వం ఆర్డర్‌ చేసింది. ఈ వ్యాక్సిన్‌ కంపెనీలకు అడ్వాన్స్‌ కింద 30 శాతం మొత్తాన్ని కేంద్రం చెల్లించింది. కాగా బయోలాజికల్‌-ఈ కంపెనీకి చెందిన కార్బివాక్స్‌ డోసులను 30 కోట్ల  మేర ఆర్డర్‌ చేసింది. బయోలాజికల్‌-ఈ టీకాలు సెప్టెంబర్‌ కల్లా అందుబాటులోకి రానున్నాయి.

దేశంలో కొవిడ్‌ టీకాల పంపిణీ 24కోట్లకు చేరువైంది. మంగళవారం రాత్రి 7 గంటల వరకు అందిన తాత్కాలిక సమాచారం మేరకు.. మొత్తం 23,88,40,635 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మంగళవారం 18-44 ఏళ్లలోపు వారిలో 13,32,471 మంది మొదటి డోసు, 76,723 మంది లబ్ధిదారులు రెండో మోతాదు తీసుకున్నారని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇప్పటి వరకు టీకాల్లో హెల్త్‌కేర్‌ వర్కర్లకు 99,95,552 మొదటి డోసు.. 68,91,662 రెండో డోసు వేశారు.