తూర్పు లడఖ్‌లో 22 చైనా యుద్ధ విమానాల విన్యాసాలు

చైనా వైమానిక దళం ఇటీవల తూర్పు లడఖ్ ఆవ‌లి వైపు యుద్ధ విమానాల విన్యాసాలు చేప‌ట్టింది. చైనా వైమానిక దళానికి చెందిన 21-22 యుద్ధ విమానాలు విన్యాసాలు చేప‌ట్టాయి. వీటిలో జే -11, జే -16 ఫైటర్ జెట్‌లు కూడా ఉన్నాయి. ఈ విమానాలు చైనా సరిహద్దులో ఎగిరాయి. 

విమానాల సంఖ్యను రహస్యంగా ఉంచేందుకు కాంక్రీట్ నిర్మాణాలు కూడా వారి వైపున‌ నిర్మించిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఈ విన్యాసాల‌ను భార‌త వాయు సైన్యం నిశితంగా గ‌మ‌నించింది. భారత సైన్యం లడఖ్ ప్రాంతంలో వైమానిక పెట్రోలింగ్ చేప‌డుతూనే ఉన్న‌ది.

లడఖ్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసిన‌ప్ప‌టి నుంచి ఈ ప్రాంతంలో భారత వైమానిక దళం కార్యకలాపాలు కూడా పెరిగాయి. చైనాలోని హోటాన్, గార్ గున్సా , కష్గర్ ఎయిర్‌బేస్‌ల నుంచి చైనా జెట్‌లు బయలుదేరాయి. ఈ ఎయిర్‌బేస్‌లు అన్ని రకాల ఫైటర్ జెట్‌లకు అనుగుణంగా ఇటీవల ఆధునీక‌రించారు. 

భారతీయ యుద్ధ విమానాలు కూడా ఈ ప్రాంతాల్లో నిరంతరం వ్యాయామాలు చేస్తున్నాయి. వీటిలో ఇటీవల భారతదేశానికి చేరుకున్న 24 రాఫెల్ విమానాలు కూడా ఉన్నాయి. వీటి కారణంగా వాస్తవ నియంత్రణ రేఖ వ‌ద్ద‌ మన బలం పెరిగిందని వైమానిక ద‌ళం న‌మ్ముతున్న‌ది.

పాంగ్యాంగ్ నుంచి చైనా తన బలగాలను ఉపసంహరించుకున్న‌ప్ప‌టికీ హెచ్‌క్యూ -9, హెచ్‌క్యూ -16 పై వాయు రక్షణ వ్యవస్థలను అలాగే ఉంచేసిందని కొన్ని వర్గాలు తెలిపాయి. ఈ వాయు రక్షణ వ్యవస్థలు మ‌న దేశ విమానాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఆస్కారం ఉన్న‌ది. అందుకే ఏప్రిల్-మే నెలల్లో సుఖోయ్ -30, మిగ్ -29 లను తన ఫార్వర్డ్ ఎయిర్‌బేస్‌ల వద్ద భారతదేశం మోహరించింది.