టెక్నాలజీలో చైనాకు చెక్ … అమెరికా 250 బిలియన్ల డాలర్లు 

టెక్నాల‌జీ రంగంలో దూసుకెళ్తున్న‌ డ్రాగ‌న్ దేశం చైనాకు కౌంట‌ర్ ఇచ్చేందుకు అగ్ర‌రాజ్యం అమెరికా భారీ ప్రణాళిక‌తో ముందుకు వెళ్తోంది. శాస్త్ర‌, సాంకేతిక రంగాల్లో ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు అమెరికా సేనేట్ ఇవాళ ద ఇన్నోవేష‌న్ అండ్ కాంపిటీష‌న్ యాక్ట్ బిల్లును పాస్ చేసింది. 

అంత‌ర్జాతీయంగా ఇటీవ‌ల అమెరికాకు గ‌ట్టి పోటీ ఎదుర‌వుతున్న‌ది. ముఖ్యంగా చైనా ఆ పోటీ ఎక్కువైంది. ఈ నేప‌థ్యంలో సాంకేతిక రంగంలో ప‌రిశోధ‌న‌లు, ఉత్ప‌త్తిని పెంచేందుకు అమెరికా భారీ ప్లాన్ వేసింది. సుమారు 250 బిలియ‌న్ డాల‌ర్ల ప్యాకేజీకి సేనేట్ ఆమోదం తెలిపింది.

రిప‌బ్లిక‌న్లు, డెమోక్రాట్లు ఆ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. వారి మ‌ధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నా.. చైనాను ఢీకొట్టాలంటే శాస్త్ర‌, సాంకేతిక రంగాల‌ను బ‌లోపేతం చేయాల‌ని అమెరికా భావిస్తున్న‌ది. సేనేట్‌లో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇక దిగువ స‌భ‌లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాతే అది చ‌ట్టంగా మారుతుంది.

అమెరికా చ‌రిత్ర‌లోనే ఇది అతిపెద్ద పారిశ్రామిక బిల్లు అని మ‌ద్ద‌తుదారులు తెలిపారు. గ‌త కొన్ని ద‌శాబ్ధాల్లో సైంటిఫిక్ రీస‌ర్చ్ కోసం ఇంత పెద్ద పెట్టుబ‌డి ఎప్పుడూ జ‌ర‌గలేదన్నారు. ప్ర‌స్తుతం కంప్యూట‌ర్ చిప్‌ల కొర‌త ఉన్న నేప‌థ్యంలో ఇదో స‌మ‌స్య‌గా మారింది. 

టెక్నాల‌జీ రీస‌ర్చ్‌, సెమీకండ‌క్ట‌ర్ డెవ‌ల‌ప్మెంట్‌, మాన్యూఫ్యాక్చ‌రింగ్‌, రోబో మేకింగ్‌, చిప్ మేకింగ్‌లో నిధుల‌ను ఖ‌ర్చు చేయ‌నున్నారు. గ‌వ‌ర్న‌మెంట్ ప‌రిక‌రాల్లో టిక్‌టాక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయ‌రాదు అని నిషేధం విధించారు. 

కొత్త చ‌ట్టం ప్రకారం.. చైనాలో త‌యారైన డ్రోన్ల‌ను ఖ‌రీదు చేయ‌రు. సైబ‌ర్ దాడుల‌కు పాల్ప‌డుతున్న చైనా సంస్థ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోనున్నారు. సేనేట్‌లో బిల్లు పాసైన తీరును అధ్య‌క్షుడు బైడెన్ స్వాగ‌తించారు. అమెరికా కార్మికులు, అమెరికా ఆవిష్క‌ర‌ణ‌ల‌పై పెట్టుబ‌డి పెట్టి చాలా కాలం అవుతోంద‌న్నారు.