ఆనందయ్య కంటి చుక్కల మందుపై త్వరగా తేల్చండి

ఆనందయ్య కంటి చుక్కల మందును స్టెరిలిటీ పరీక్షకు పంపి, రెండు వారాల్లోగా నివేదిక పొందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. 

అలాగే, కె మందు విషయంలో ఎలాంటి దుష్ప్రభావాలూ లేవని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో పంపిణీలో ఎలాంటి ఆటంకాలూ కలిగించవద్దని ఆదేశించింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ కె.విజయలక్ష్మి, జస్టిస్‌ డి. రమేష్ తో  కూడిన ధర్మాసనం ఇటీవల ఆదేశాలిచ్చింది.

ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు పంపిణీని కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గుంటూరు జిల్లాకు చెందిన న్యాయవాది పొన్నెకంటి మల్లికార్జునరావు, అనంతపురానికి చెందిన మాదినేని ఉమామహేశ్వరనాయుడు వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ మందును కొవిడ్‌ చికిత్సకు అందించే ఆయుర్వేద మందుగా ప్రకటించేలా కేంద్ర, రాష్ట్రాలను ఆదేశించాలని కోరారు. మరోవైపు కొవిడ్‌ మందు తయారీకి అవసరమైన పదార్థాలు, ఫార్ములా చెప్పాలని అధికారులు వేధిస్తున్నారని ఆనందయ్య హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరుపుతోంది. 

ఆనందయ్య తయారు చేస్తున్న మొత్తం ఐదు రకాల మందుల్లో పి, ఎఫ్‌, ఎల్‌ మందుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. కె మందు, కంటి చుక్కల మందుల విషయంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో నిపుణులకమిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ముందుంచింది. కె మందు వినియోగించడం వల్ల దుష్ప్రభావాలు లేవని కమిటీ పేర్కొంది.

కంటి చుక్కల విషయంలో స్టెరిలిటీ పరీక్ష నిర్వహించాల్సి ఉందని, అందుకు 1-3 నెలల సమయం పడుతుందని వివరించింది. కాగా, చుక్కల మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది చెబుతున్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. కంటి చుక్కల మందుపై సాధ్యమైనంత త్వరగా పరీక్షలయి, నివేదిక వచ్చేలా చూడాలని  రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.