ఏపీ ప్రభుత్వ `అక్రమ’ కేసులపై సీఎంల మద్దతు కోరిన రఘురామ!

‘‘అక్రమాస్తుల కేసులో బెయిల్‌ రద్దు చేయమంటూ సీబీఐ కోర్టులో కేసు వేశానన్న కక్షతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ నాపై  రాజద్రోహం(124-ఏ) కేసు పెట్టించారు. ఈ కేసులో సీఐడీ పోలీసులతో నన్ను తీవ్రంగా కొట్టించి, చిత్రహింసలకు గురిచేశారు. ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో మీ మద్దతును కోరుకొంటున్నాను’’ అని దేశంలోని ముఖ్యమంత్రులు అందరికి వ్రాసిన లేఖలలో నరసాపురం వైసీపీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణ రాజు అభ్యర్థించారు. 

ఈ మేరకు ఆయన సోమవారం ఐదు పేజీల లేఖ రాశారు. రాజద్రోహం కేసులో సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు, ఏపీ హైకోర్టు ఆదేశాలు, ఏపీ సీఐడీ కస్టడీలో కొట్టిన తన గాయాలకు సంబంధించిన ఫొటోలు, ఢిల్లీ ఎయిమ్స్‌లో  వైద్యపరీక్షల అనంతరం గుర్తించిన గాయాల ఫొటోల ప్రతులను ఈ లేఖకు  జతచేశారు. 

‘‘స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒక ఎంపీగా ఉన్న నాపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. 124-ఏ రాజద్రోహం సెక్షన్‌ను దుర్వినియోగం చేశారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలు, అవినీతిని ఎత్తిచూపిస్తున్నాననే ఇదంతా చేశారు. ఒక ఎంపీనని కూడా చూడకుండా సీఐడీ పోలీసులు అమానవీయంగా, కిరాతకంగా వ్యవహరించారు” అంటూ ఆ లేఖలలో ఆరోపించారు. 

ఐదు నెలలక్రితమే తనకు ముంబైలో బైపాస్‌ ఆపరేషన్‌ జరిగిందని చెప్పినా, ముసుగులు ధరించిన ఐదుగురు వ్యక్తులు తనను కిరాతకంగా కొట్టారని తెలిపారు. రాజద్రోహం సెక్షన్‌ను ఏపీలో కక్ష సాధింపు కోసం దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. 124-ఎ సెక్షన్‌ రద్దు కోరుతూ తమ తమ అసెంబ్లీలో తీర్మానించి, కేంద్రానికి పంపేలా చర్యలు తీసుకోగలరని కోరారు. అలాగే ఈ సెక్షన్‌ రద్దుపై పార్లమెంటు సమావేశాల్లో వారి పార్టీ ఎంపీలు మాట్లాడేలా చూడాలని అభ్యర్ధించారు.

గతనెల 14న  తనను ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసినప్పటి నుంచి చోటుచేసుకున్న పరిణామాలను ఆ లేఖలో వివరించారు. ఏపీ సీఎంపై నాంపల్లి సీబీఐ కోర్టులో ఉన్న కేసు తాజా వివరాలతో పాటు తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని సాక్షులుగా ఉన్న ఉన్నతాధికారులకు ఉన్నతపదవులు, హోదాలు కల్పించి వైఎస్‌ జగన్‌ ఎలా ప్రభావితం చేస్తున్నారో ఆ లేఖలో వివరించారు.

‘‘జగన్‌ తన సహనిందితులకు పలు కీలక పదవులు కట్టబెట్టారు. తెలంగాణ కేడర్‌కు చెందిన ఒక మహిళా ఐఎఎస్ ని ఏపీ కేడర్‌ కింద మార్పించి, ఉన్నత పదవిలో నియమించారు. సహనిందితునిగా ఉన్న అధికారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించుకున్నారు” అంటూ వివరించారు. 

వైఎస్‌ జగన్‌ సీఎం పదవిలో కొనసాగడంవల్లే తన అక్రమాస్తుల కేసులో సాక్షులు, నిందితులుగా ఉన్న అధికారులను, అధికారేతరులను ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. ప్రలోభాలకు లొంగని అధికారులను ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసుల్లో ఇరికిస్తూ, వేధిస్తున్నారని ఆ లేఖలో  రఘురామరాజు పేర్కొన్నారు. 

తన కేసులో మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా ఎంపీలందరికీ ఆయన ఇటీవల లేఖలు రాసిన విషయం తెలిసిందే. అలాగే పలువురు కేంద్ర మంత్రులు, పెద్దలను కలుస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ఎంపీలు, పార్టీల పెద్దలు లేఖలు, ట్వీట్‌ల రూపంలో రఘురామరాజుకు సంపూర్ణ మద్దతు తెలిపారు.