ఏపీలో ఈ నెల 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి విధించిన కర్ఫ్యూను ప్రభుత్వం మరోమారు పొడిగించింది. ఈ నెల 20 వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూ గడువు ఈ నెల 10తో ముగుస్తున్నది. 

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి మరో పది రోజులపాటు కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే కర్ఫ్యూ సడలింపు సమయంలో కూడా ప్రభుత్వం మార్పులు చేసింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలు తమ వివిధ అవసరాలు తీర్చుకోవడానికి అవకాశం కల్పించింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు నడవనున్నాయి.

కొవిడ్‌ మూడో వేవ్‌ వస్తుందన్న ఊహగానాల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధతపై ముఖ్యమంత్రి సమీక్ష జరుపుతూ చిన్నారుల కోసం రాష్ట్రంలో 3 కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. విశాఖ, తిరుపతి, విజయవాడ-గుంటూర్‌లో వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. 

ఒక్కో దవాఖానకు రూ. 180 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. అన్ని బోధనా ఆస్పత్రుల్లో పీడియాట్రిక్‌ వార్డులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, కరోనా మూడో వేవ్‌పై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లల్లో లక్షణాలు గుర్తించేందుకు ఆశావర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. చిన్నారులకు పోషకాహార పంపిణీ, టీకాల కార్యక్రమం కొనసాగించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

మరోవంక, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గు ముఖం ప‌ట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 4,872 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 86 మంది చ‌నిపోయారు. గ‌త 24 గంట‌ల్లో 13 వేల 702 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 1,14,510 క‌రోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న ఒక్క‌రోజే 64 వేల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. క‌రోనాతో చిత్తూరు జిల్లాలో 13 మంది, గుంటూరు జిల్లాలో 10, శ్రీకాకుళంలో 9, విజ‌య‌న‌గ‌రం, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో ఏడుగురు చొప్పున మ‌ర‌ణించారు.