డీజీ సునీల్ కుమార్ పై ఢిల్లీ పోలీసుకు రఘురామ ఫిర్యాదు 

ఏపీ సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ సునీల్ కుమార్ పై ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ కు  నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. మే14న తనను అరెస్ట్ చేసినప్పుడు తన నుంచి ఐఫోన్ తీసుకున్నారని, ఇంతవరకు తిరిగివ్వలేదని తన ఫిర్యాదులో ఆరోపించారు. స్వాధీనం చేసుకున్న ఫోన్ లో 90009 11111 నెంబరుతో వాట్సాప్ ఖాతా ఉందని వివరించారు. 
స్వాధీనం చేసుకున్న వస్తువుల జాబితాలో ఫోన్ ను చేర్చలేదంటూ లీగల్ నోటీసు ఇచ్చానని ఢిల్లీ డీసీపీకి తెలిపారు. గత నెల 14వ తేదీ రాత్రి సునీల్ కుమార్ సహా నలుగురు తనను తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. తర్వాత మరో వ్యక్తి తన ఛాతీపై కూర్చుని ఫోన్ లాక్ తెరవాలని ఒత్తిడి చేశారని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణరక్షణ కోసం ఫోన్ లాక్ ఓపెన్ చేసినట్టు ఫిర్యాదులో వివరించారు. 
మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌, కుటుంబ సభ్యులకు తన వాట్సాప్‌ నెంబర్‌ నుంచి పలుమార్లు మెసేజ్‌లు పంపారని ఆరోపించారు. ప్రభుత్వ సేవకుడే చట్టాలను ఉల్లంఘించి నేరపూరితంగా వ్యవహరించారని అని ఆరోపించారు. సునీల్‌కుమార్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రఘురామ విజ్ఞప్తి చేశారు. 
ఇలా ఉండగా, తనను అరెస్ట్ చేసి చిత్ర హింసలు పెట్టారని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు దాదాపు ఎంపీలందరికీ లేఖలు రాసిన విషయం విదితమే.  తాజాగా సీఐడీ అడిషనల్‌ డీజీ సునీల్‌కుమార్‌కు రఘురామ లీగల్‌ నోటీసు ఇచ్చారు. తన అరెస్ట్‌ సమయంలో పోలీసులు తీసుకున్న ఐ-ఫోన్‌ను తిరిగి ఇవ్వాలంటూ నోటీసులో ఎంపీ పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న ఐ-ఫోన్‌ను రికార్డుల్లో ఎక్కడా చూపలేదన్న విషయాన్ని కూడా నోటీసులో ఆయన చెప్పుకొచ్చారు.
ఫోన్‌లో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా తనకు సంబంధించిన చాలా విలువైన సమాచారం ఫోన్‌లోనే ఉందని,  పార్లమెంట్‌ విధులను నిర్వర్తించడానికి ఫోన్ తిరిగి ఇవ్వాలని నోటీసులో తెలిపారు. ఫోన్‌ తిరిగి ఇవ్వని పక్షంలో సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని కూడా నోటీసులో రఘురామ ఒకింత హెచ్చరించారు.