ముఖ్యమంత్రి కాకముందు ఉన్న ఆస్తులు, ఇప్పుడున్న ఆస్తులపై సీబీఐ విచారణకు కేసీఆర్ సిద్ధమా? అని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ జి. వివేక్ వెంకటస్వామి సవాల్ విసిరారు. ‘‘ఈటల రాజేందర్ తన ఆస్తులపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణకు సిద్ధమని ఇది వరకే ప్రకటించారు. సీఎం కేసీఆర్ కూడా తన ఆస్తులపై విచారణకు సిద్ధపడాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణాలో కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తానని ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేక్ వెంకటస్వామి స్పష్టం చేసారు. హుజూరాబాద్‌లో కేసీఆర్ వర్సెస్ ఈటల ఫైట్ ఉండబోతుందని, దుబ్బాక తరహాలోనే ఇక్కడా బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
తాను బీజేపీలో చేరడానికి ముందు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాట్లాడినప్పుడు ‘‘కేసీఆర్‌తో కొట్లాడాలని అనుకుంటేనే నన్ను చేర్చుకోమని చెప్పిన’’ అని వివేక్ తెలిపారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. తాను బీజేపీలో చేరే సమయానికి రాష్ట్రంలో పార్టీకి ఓట్‌షేర్ 8% ఉందని, దాన్ని 40 శాతానికి పెంచినప్పుడే కేసీఆర్‌ను దెబ్బకొట్టగలుగుతామని చెప్పారు. ఇదే లక్ష్యంగా అందరితో కలిసి పని చేస్తున్నానని తెలిపారు.
ఈటల కొన్న భూముల్లో ఎస్సీ, ఎస్టీలవి లేవని చెప్పారు. ఒక్క ఎకరం ఎస్సీ, ఎస్టీల భూమి ఉన్నా ముక్కు నేలకు రాస్తానని ఈటల జమున ఇప్పటికే ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. దేవరయాంజాల్‌లోని భూములకు బ్యాంకులు లోన్లు ఇచ్చాయంటే అవి సక్రమమైనవే కదా అని ప్రశ్నించారు. అవే భూములను మార్టిగేజ్ చేసి ‘నమస్తే తెలంగాణ’ పేపర్‌కు లోన్ తీసుకున్నారని గుర్తు చేశారు.
ఆ భూములు నేరుగా ఈటల కొనుగోలు చేయలేదని, మంత్రి కేటీఆర్ సన్నిహితుల నుంచి చేతులు మారిన తర్వాత 2004లో ఈటల కొన్నారని ఆయన వివరించారు. ఆస్తులు కాపాడుకోవడానికే ఈటల బీజేపీలో చేరుతున్నారనే విమర్శలపై వివేక్ స్పందిస్తూ.. ఇలాంటి ఆరోపణలు చేయడం టీఆర్‌ఎస్ నేతలకు ఫ్యాషన్ అయిపోందని మండిపడ్డారు.
ఉద్యమకారులపై తప్పుడు కేసులు పెట్టించి కేసీఆర్ బయటకు పంపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ. 200 కోట్లు ఖర్చు చేసి టీఆర్‌ఎస్ గెలిచిందని, హుజూరాబాద్‌లో ఇప్పటికే రూ.50 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు.
ఎంపీగా కేసీఆర్ రాజీనామా చేసినప్పుడు వైఎస్ ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా ప్రజలు కేసీఆర్‌ను గెలిపించినట్టే, హుజూరాబాద్‌లో ఈటలను గెలిపించబోతున్నారని ఆయన ధీమా వ్యక్ట్ఘం చేశారు. నాగార్జునసాగర్‌లో వీకర్ సెక్షన్‌కు టికెట్ ఇవ్వాలని ఎస్టీ అభ్యర్థిని బరిలో దించామని తెలిపారు.
ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని చెబుతూ ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కవిత, కరీంనగర్లో వినోద్‌ను ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. అలాంటి ఫలితమే హుజూరాబాద్‌లోనూ వస్తుందని చెప్పారు.
బీజేపీతో స్నేహంపై కేసీఆర్ పలు సందర్భాల్లో తప్పుడు ప్రచారం చేశారని, ఈటలకు ఇవే అనుమానాలు ఉండేవని వివేక్ పేర్కొన్నారు. పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డాతో సమావేశంలోనూ ఈటల ఇదే అనుమానం వ్యక్తం చేశారని తెలిపారు. టీఆర్‌ఎస్‌తో ఎలాంటి అవగాహన లేదని, రాజకీయ పోరాటమే ఉంటుందని నడ్డా స్పష్టం చేశారని ఆయన వివరించారు.
ఉద్యమ సమయం నుంచి ఈటలతో సాన్నిహిత్యం ఉంది కాబట్టే ఆయనను చేర్పించే బాధ్యత పార్టీ తనకు అప్పగించిందని తెలిపారు. ఈటల చేరికపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డితోనూ తాను మాట్లాడనని చెప్పారు. పార్టీలో చేరిక ఖాయమైన తర్వాత సమాచారం ఇద్దామని అనుకున్నామనే విషయం పెద్దిరెడ్డికి వివరించాని, ఇందులో తప్పేదైనా ఉంటే అది తనదేనని అన్నానని తెలిపారు.
కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ఈటల రాజేందర్ సొంత పార్టీ పెట్టాలని అనుకున్నారని వివేక్ తెలిపారు. ‘‘పీడీఎస్‌యూలో పనిచేసిన తాను బీజేపీలో ఇమడగలనా లేదా అని ఈటల ఆలోచించారు. బీజేపీ నాయకత్వం ఆదేశాలతో నేను ఈటలతో చర్చించాను. ఇక్కడ లెఫ్ట్ లేదు.. రైట్ లేదు.. కేసీఆర్ కుటుంబం వర్సెస్ ప్రజలుగా సాగుతున్న పోరాటంలో ప్రజల వైపు నిలువాలని సూచించాను” అని వివరించారు.
More Stories
రుణమాఫీపై బహిరంగ చర్చకు రేవంత్ కు ఏలేటి సవాల్!
ముందు చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించండి రేవంత్
బంజారా మ్యూజియం ప్రారంభించిన ప్రధానికి కృతజ్ఞతలు