కరోనాపై పలాయనవాది కేటీఆర్… బిజెపి ఆగ్రహం 

కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ విధానం, అమలుపై మంత్రి కెటి రామారావు చేసిన తప్పుడు ఆరోపణల పట్ల తెలంగాణ బిజెపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. `ఆరోగ్యం’ రాష్ట్ర ప్రభుత్వ అంశమని గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్ తమ బాధ్యతను కేంద్రంపై నెట్టివేసి పలాయనవాదిగా వ్యవహరిస్తున్నారని బిజెపి తెలంగాణ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె కృష్ణసాగరావు విమర్శించారు.

అసలు కోవిద్ విధానంపై తెలంగాణ ప్రభుత్వానికి ఒక విధానం అంటూ లేదని ఆయన ధ్వజమెత్తారు. మార్చి 2020 నుండి పరీక్షించడానికి, కనిపెట్టడానికి, వేరుచేయడానికి ఐసిఎంఆర్  మార్గదర్శకాలను అమలు చేయడంలో ఎటువంటి సామర్ధ్యాన్ని కూడా ప్రదర్శింప లేకపోయినదని ఆయన మండిపడ్డారు. 

ఈ భారీ ప్రపంచ మహమ్మారికి సంబంధించి ప్రజారోగ్యంపై తలెత్తిన సవాళ్ళను ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైనదని ఆయన స్పష్టం చేశారు. అసలు ఈ సందర్భంగా ఎటువంటి జవాబుదారీతనం ప్రభుత్వంలో కనిపించలేదని విస్మయం వ్యక్తం చేశారు. 

టీకాలను వృధా చేసే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 3 లేదా 4 వ స్థానంలో ఉండవచ్చని మంత్రి కెటిఆర్ తెలుసుకోవాలని కృష్ణసాగరరావు హితవు చెప్పారు. అందుకు సంబంధించిన వివరాలు సమర్పించాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని  హెచ్చరించిన తరువాత కూడా టీకా వివరాలను హైకోర్టుకు ఎందుకు సమర్పించలేకపోతున్నారో ఆయన వివరించాలని బిజెపి నేత ప్రశ్నించారు. .

కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన పోవడం ద్వారా, ఫిబ్రవరి 2021లో లక్షలాది వ్యాక్సిన్ల డోస్ లను స్వీకరించిన తరువాత కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని విమర్శించారు. టీకా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం 2021 జనవరిలో ప్రారంభించిందని గుర్తు చేసారు. 

మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కేవలం మూడు జిల్లాలు మాత్రమే టీకా కార్యక్రమాలను ఎందుకు ప్రారంభించాయో మంత్రి కెటిఆర్ వివరించాలని నిలదీశారు. రాష్ట్రంలో మొత్తం టీకాలలో 45 శాతం పైగా ప్రైవేట్ ఆసుపత్రులు ఎందుకు వేసాయో కూడా మంత్రి వివరించాలని సవాల్ చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తోంది? టిఆర్ఎస్ ప్రభుత్వం, వారి  మంత్రుల పాలన గురించి తాను ప్రస్తావింపదలచుకో లేదని కృష్ణసాగర రావు స్పష్టం చేశారు. కాని ఇటువంటి క్లిష్ట సమయంలో రాజకీయంగా కేంద్ర ప్రభుత్వంపై అసంబద్దపు ఆరోపణలు చేయడం,  సంకుచిత రాజకీయ నినాదాలతో ప్రభుత్వం మునిగిపోయినదని విచారం వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో వేలాది మంది మరణాలకు దారితీసిన ఈ భారీ ప్రజారోగ్య సంక్షోభం మధ్యలో తెలంగాణ రాష్ట్రానికి పూర్తి సమయం ఆరోగ్య మంత్రి కూడా లేకపోవడం సిగ్గుచేటని కృష్ణసాగర రావు ధ్వజమెత్తారు. మార్చి 2021 నుండి రాష్ట్ర వ్యాక్సిన్ ప్రోగ్రాం కాలక్రమం, దాని అమలు వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బిజెపి మంత్రి కెటి రామారావును సవాలు విసిరింది. 

ప్రస్తుతం సరఫరా తక్కువగా ఉంది, డిమాండ్ భారీగా ఉన్న సమయంలో ఏ వ్యాక్సిన్  తయారుదారుడు కూడా పోటీపడే అవకాశం లేదని చెబుతూ, ఇటువంటి పరిస్థితులలో గ్లోబల్ టెండర్లను పిలవడంపై మంత్రి కేటీఆర్ కు గాని, సీఎం కేసీఆర్ కు గాని ఇంగిత జ్ఞానం లేదా అని ప్రశ్నించారు. 

రాష్ట్రాలను తమకే తామే వ్యాక్సిన్ లను సమకూర్చుకోవాలని కేంద్రం ఎప్పుడు చెప్పలేదని స్పష్టం చేసారు. అయితే వ్యాక్సిన్ లను సేకరించడంలో తమకు స్వేచ్ఛ ఇవ్వాలని తెలంగాణ వంటి రాష్ట్రాలు కేంద్రాన్ని కోరామని గుర్తు చేశారు. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేయడం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత, అవకాశవాద వైఖరి అని బిజెపి నేత స్పష్టం చేశారు. 

మంత్రి కెటిఆర్ తమ ప్రభుత్వ బాధ్యతల నుండి తప్పించుకోవడానికి, రాజకీయ ప్రయోజనాలకోసం చౌకబారు నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన పాఠం నేర్పుతారని ఈ సందర్భంగా కృష్ణసాగరరావు హెచ్చరించారు. .