అల్లోపతి – ఆయుర్వేద వివాదం కాదు, సయోధ్య అవసరం 

చలసాని నరేంద్ర 
చైనాలోని వుహాన్ నుంచి విడుదలైన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్నది. మనదేశంలో గత రెండు నెలలుగా ఈ మహమ్మారి కారణంగా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా సెకండ్‌‌ వేవ్‌‌ సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. వైద్య నిపుణులందరూ ఈ రోజు ఫ్రంట్‌‌లైన్ వారియర్స్గా ఈ మహమ్మారిపై పోరాటం చేస్తున్నారు. కరోనా నుంచి దేశం దృష్టిని మరల్చే ఎటువంటి చర్య అయినా దేశానికి, సమాజానికి మంచిది కాదు. 

ఇటువంటి పరిస్థితుల్లో అటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) అధ్యక్షుడు డాక్టర్ జాన్రోస్ ఆస్టిన్ జయలాల్, ఇటు యోగా గురువు బాబా రామ్‌‌దేవ్ ఆరోపణలు, ప్రత్యారోపణలు, దూషణలు చివరకు అల్లోపతి, ఆయుర్వేద వైద్య విధానాల మధ్య పోరుగా మారుతున్నది. ఇది చాలా దురదృష్టకరం.

ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జయలాల్ క్రిస్టియానిటీ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయుర్వేదాన్ని ప్రతికూలంగా వర్ణించటానికి ప్రయత్నించారు. భారతీయ సాంస్కృతిక విలువలు, హిందూత్వంపై సంప్రదాయ విశ్వాసాలను దెబ్బ తీసే రీతిలో వ్యవహరించారు. కరోనా చికిత్స  విషయంలో ఆయన క్రైస్తవ మత ప్రస్తావన తీసుకురావడం పూర్తిగా అసంబద్ధమైన అంశమే.

ఇదే అదనుగా, ఆయుర్వేదం, ఇతర భారతీయ వైద్య విధానాలను కొంతమంది ప్రముఖ అల్లోపతి డాక్టర్లు నకిలీ శాస్త్రంగా కొట్టిపారవేయడం, ఈ వైద్య విధానాల పట్ల ఒకవిధమైన అసహనాన్ని ప్రకటించడం ఆందోళన కలిగిస్తున్నది. డాక్టర్ జయలాల్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఈ చిచ్చు రేపడానికి మూలకారణమని చెప్పవచ్చు. ఒక విదేశీ క్రైస్తవ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను క్రైస్తవ  డాక్టర్గా పనిచేస్తున్నానని, భారత్ లోని లౌకిక సంస్థల్లో ఎక్కువ మంది క్రైస్తవ  డాక్టర్లు అవసరమని పేర్కొనడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.

అల్లోపతి పూర్తిగా పాశ్చాత్య విధానం కాదు

వైద్యరంగంలో ఇటువంటి స్పష్టమైన మత వర్ణన విస్మయం కలిగిస్తోంది. ఒక వైద్య నిపుణుడి అనాలోచితమైన ఈ అనైతిక వ్యవహారాన్ని ప్రధాన స్రవంతి మీడియా ఏదీ ప్రశ్నించకపోవడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దానితో కొన్ని వర్గాలకు అల్లోపతిని ‘పాశ్చాత్య’ వైద్య విధానమని ప్రశ్నించే అవకాశం ఏర్పడింది. 

వాస్తవానికి, అల్లోపతి కచ్చితంగా పాశ్చాత్య వైద్య విధానమని కొట్టిపారవేయలేం. అది విభిన్న స్వదేశీ సంస్కృతులు, సంప్రదాయాల సమ్మిళతంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. భారతీయ వైద్య విధానంలోని అనేక మూలికలను ఇప్పుడు అల్లోపతి ఔషధాలలో ఉపయోగిస్తున్నారు. అయితే అల్లోపతి ఔషధాలు భౌతిక, ప్రాపంచిక దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తుంటాయి.

ఎప్పటికప్పుడు ఈ ఔషధాలు తమ లోపాలను సరి చేసుకుంటూ, మరింత మెరుగైన ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నాయి. వీటికి ప్రపంచంలోని పెద్ద పెద్ద ఫార్మా ఇండస్ట్రీల మద్దతు ఉంది. వారి ఆర్థిక ప్రయోజనాలు ఈ మందుల వినియోగంలో ఇమిడి ఉన్నాయి. ప్రజల ఆరోగ్యం కన్నా, మితిమీరిన లాభాలపైనే వారి దృష్టి అనే అపవాదులు లేకపోలేదు.

సమ్మిళిత వైద్య విధానంకు మహత్తర అవకాశం

చైనాలో మాదిరిగా అన్ని వైద్య విధానాల సమ్మిళితంతో మానవాళికి మెరుగైన వైద్య విధానాన్ని స్వదేశీయంగా రూపొందించుకోవడానికి ప్రస్తుత కరోనా సంక్షోభం ఒక మహత్తర అవకాశం కలిపించినదని చెప్పుకోవచ్చు. అందుకనే విభిన్న వైద్య విధానాలను పరస్పరం విరుద్ధమైనవి అని కాకుండా, పరస్పర పూరకాలుగా భావించి, ఆ దిశలో ప్రయత్నం చేయలేమా? 

ఆయుర్వేదం వంటి స్వదేశీ వ్యవస్థల విషయంలో, వాటి రోగనిర్ధారణ పద్ధతులతో పాటు అల్లోపతి శాస్త్రీయ దృష్టితత్వంతో అనుసంధానం కావించాల్సిన అవసరం ఉంది. నానో మెడిసిన్ టెక్నాలజీల నుంచి న్యూరో-ఇమ్యునాలజీ, ఎథ్నో-బోటనీ నుంచి ఎవల్యూషనరీ బయాలజీ, సెల్యులార్ బయాలజీ నుంచి జెనోమిక్ స్టడీస్ వరకు వివిధ రంగాల్లో ముఖ్యమైన ఆధునిక  ఆవిష్కరణలు జరుగుతున్నాయి. సంస్థాగత సమగ్రత, సహకారం లేకుండా ఆయుర్వేదం వీటిని ఇముడ్చుకోలేదు.

సమస్య ఎమిటంటే అల్లోపతి డాక్టర్లు చాలామంది ఔషధాల ఏకీకరణ విషయంలో ఆయుర్వేదం పట్ల ఒక విధమైన అసహనంతో వ్యవహరిస్తున్నారు. పాశ్చాత్య అల్లోపతి వైద్యంతో ఆయుర్వేదం, యునాని, సిద్ధ, హోమియోపతి, యోగా, ప్రకృతివైద్యం వంటి భారతీయ వైద్య విధానాలను ఏకీకృతం చేయడానికి మోదీ  ప్రభుత్వం తీసుకున్న చొరవ చాలా ఆలస్యంగా జరిగినప్పటికీ, ఈ దిశలో వైద్యరంగంలో పెనుమార్పులకు దారితీసే అవకాశం ఉంది.

మనకు అల్లోపతి, ఆయుర్వేదం, సిద్ద వంటి స్వదేశీ వైద్య వ్యవస్థల సంయుక్త టాస్క్ ఫోర్స్ ఉంటే, ఇప్పటికే ఈ  మహమ్మారికి వ్యతిరేకంగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే చికిత్సను సమర్థవంతంగా అందించగలిగేవారం.

ఈ శతాబ్దంలోనే అతిపెద్ద సంక్షోభం 

ఈ శతాబ్దంలోనే మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం కరోనా మహమ్మారి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  అభివర్ణించారు. ఈ సంక్షోభ సమయంలో కరోనా ట్రీట్మెంట్ కు అల్లోపతి ఇప్పటి వరకు ఎటువంటి ఔషధం చూపలేక పోయింది. కేవలం నివారణగా టీకాలు మాత్రమే వచ్చాయి. అవీ అందరికీ అందుబాటులో లేవు. టీకాలు వేసుకున్న వారిలో సహితం పలువురికి కరోనా వచ్చింది. వారిలో కొందరు చనిపోయారు. 

కరోనా చికిత్స  విషయంలో ఏడాదిగా అల్లోపతిలో చూపుతున్న పద్ధతులు తరచూ మారుతూ వస్తున్నాయి. ప్లాస్మా వైద్యం నుంచి అనేక చికిత్సలను  అద్భుత పరిష్కారంగా చూపడం, కొన్ని నెలలకు అవి పనికిరావని వెనక్కి తీసుకోవడం జరుగుతూ వస్తున్నది. అందుకనే అల్లోపతి శాశ్వత పరిష్కారం చూపదనే అభిప్రాయం సర్వత్రా కలుగుతున్నది.

కరోనా టీకాలు వచ్చిన కొత్తలో కొందరు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. వాటిని వేసుకోవద్దని ప్రేరేపించారు. ప్రస్తుత సమయంలో టీకాలను వ్యతిరేకించేవారిని మానవ సమాజానికి శత్రువులుగా పరిగణించాం. జాతీయ సంక్షోభం మన స్వదేశీ జ్ఞాన వ్యవస్థలపై దృష్టి పెట్టడానికి, మరింత అభివృద్ధి చేయడానికి అవకాశాన్ని కల్పించింది. 

కనీసం ఇప్పుడు, శాస్త్రవేత్తలు, అల్లోపతి, ఆయుర్వేద, సిద్ధ నుంచి వైద్య నిపుణులు, అలాగే అన్ని అల్లోపతి వైద్య విభాగాలకు చెందిన విశ్వసనీయ డాక్టర్లు కలిసి వచ్చి తమ  జ్ఞాన వనరులన్నింటినీ ఉపయోగించుకునే సామరస్యం, సహకార సంసిద్ధతను ప్రకటించాలి. అది దేశానికే కాదు.. ప్రపంచానికి ఎంతో మేలు చేస్తుంది.

కరోనా నియంత్రణలో ఆయుర్వేదం 

బయోజెటికా ఫౌండర్ డాక్టర్ అపుర్వే మెహ్రా ప్రకారం ‘ఆయుర్వేద మందులు రెజిన్మున్, ఇమ్యునోఫ్రీ అద్భుతమైన మార్గాన్ని చూపించాయి. “కరోనా రోగులు సాధారణంగా ట్రీట్మెంట్ లేకుండా నెగిటివ్ గా ఉండటానికి 14 రోజులు, ట్రీట్మెంట్తో 11 రోజులు పడుతుంది. ఆయుర్వేదం ప్రస్తుత చికిత్సా విధానాలను అధిగమిస్తుందని అంటే చాలామంది ఆశ్చర్యపోయారు. ఈ ట్రయిల్  ఫలితం మనదేశానికి బహుశా మంచి వార్త. ఎందుకంటే  మనం సెకండ్ వేవ్ కింద కొట్టుకుంటున్నాం” అని పేర్కొన్నారు.

అలాగే ‘ఆయుర్వేదం, టీసీఎం, ఆఫ్రికన్ సంప్రదాయాల నుంచి వచ్చిన మూలికా మందులు కరోనా చికిత్సకు, వైరస్ ను నిరోధించడంలో చాలా ప్రభావవంతంగా, సమర్థవంతంగా ఉన్నాయని ఈ కొత్త డేటా స్పష్టంగా చూపిస్తోంది. డాక్టర్ శిక్షణ, నమ్మక వ్యవస్థతో సంబంధం లేకుండా అన్ని సంప్రదాయాల నుంచి డాక్టర్ వాటిని రోగులకు సిఫారసు చేయాలి’ అని డాక్టర్ అపుర్వే చెప్పారు.

అయితే ఈ విషయమై కొంతమంది సిద్ధ, ఆయుర్వేద డాక్టర్లు కొన్ని ఆధారాలు లేని, అతిశయోక్తులతో కూడిన వాదనలు చేస్తున్నారు. ఏ వైద్య విధానం పట్ల గుడ్డిగా ద్వేషం పెంచుకోవడం, పక్షపాతంతో వ్యవహరించడం వల్ల ప్రయోజనం ఉండదు.

పరిష్కారాలు చూపిన భారతీయ వైద్య పద్ధతులు

ఈ సందర్భంగా ఆయుర్వేదమే కాకుండా సిద్ధ, యునాని వంటి భారతీయ వైద్య పద్ధతులు కొన్ని పరిష్కారాలు చూపిస్తున్నాయి. ఆఫ్రికా వంటి దేశాల్లోని స్థానిక వైద్య విధానాలు కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. అందువల్లనే ఇటువంటి దేశీయ వైద్య పద్ధతులు తమ అస్థిత్వాన్ని ప్రశ్నార్థకం చేయవచ్చనే భయం అల్లోపతి ఫార్మా కంపెనీల్లో కలుగుతున్నదా అనే అనుమానం వస్తోంది. 

అందుకనే దేశంలో నేడు అల్లోపతి–ఆయుర్వేద వివాదాన్ని సృష్టిస్తున్నారని భావించవలసి వస్తున్నది. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తికి ఎటువంటి చిన్న ఆలంబన దొరికినా ప్రాణం పోసిన్నట్లే. అదే విధంగా కరోనాతో నిత్యం వేలాది మంది చనిపోతున్న సమయంలో ఏ మందు వారి ప్రాణం నిలబెట్టినా ఎంతో ఉపశమనం కలిగిస్తున్నది. ఆ మందు ఏ వైద్య విధానానికి సంబంధించినదనే ప్రశ్న ఏర్పడదు.