బీజేపీ లేనిదే తెలంగాణ లేదు

బండి సంజయ్, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు 
* నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతాపార్టీదే కీలక పాత్ర. పరిపాలన సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు ఏర్పడాలన్నది బీజేపీ ఆలోచన. జనసంఘ్‌ పార్టీగా ఉన్ననాటి నుంచి నేటి వరకు కూడా బీజేపీ అదే ఆలోచనతో పని చేస్తున్నది. అంబేడ్కర్‌ ఆలోచనా విధానాన్ని అమలు చేస్తున్నది. 

అందులో భాగంగానే ప్రధానమంత్రి వాజపేయి హయాంలో జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. అయితే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు వ్యవహారమే మొదటి నుంచి రాజకీయ వివక్షకు గురైంది. 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నాటి పాలకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజా ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేశారు. ఉద్యమకారులపై పోలీస్‌ తూటాలు దించారు. ఫలితంగా అనేకమంది విద్యార్థులు అమరులయ్యారు. ఆ తరువాత అక్కడక్కడ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను వెలిబుచ్చుతూ మేధావులు, విద్యార్థులు, యువకులు కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. 

తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏర్పాటైన తెలంగాణ ప్రజా సమితి తరపున పార్లమెంట్‌కు ఎన్నికైన సభ్యులను కాంగ్రెస్‌ పార్టీ తనలో విలీనం చేసుకున్నది. ఆనాటి నుంచి కూడా ప్రజల్లో తెలంగాణ ఏర్పాటు విషయం లావాలా రగులుతూనే ఉన్నది. ఏనాటికైనా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాలనే ఆకాంక్ష ఎక్కువైంది. 

అయితే రాష్ట్రాన్ని సాధించాలన్నా, ఏర్పాటు చేయాలన్నా అది పార్లమెంట్‌ వ్యవస్థ ద్వారానే సాధ్యమవుతుందని, గతంలో సాధ్యమైందని భారతీయ జనతాపార్టీ స్పష్టంగా చెప్పింది. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోతే ఎక్కడికక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందని, తద్వారా తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరుతుందని బీజేపీ నిర్ణయించింది.

అందులో భాగంగానే 1997లో కాకినాడలో జరిగిన బీజేపీ సమావేశంలో ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగాతీర్మానించింది. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదాన్ని తీసుకున్నది. ఆనాటి నుంచి తెలంగాణ ఏర్పడే వరకు భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మద్దతు తెలుపుతూనే ఉన్నది.

కానీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను ఓటు బ్యాంకుగా చూశాయే తప్ప చిత్తశుద్ధితో అమలుకు ప్రయత్నించ లేదు. తద్వారా మలిదశ ఉద్యమంలో వేలాది విద్యార్థులు, యువకులు ఆత్మబలిదానం చేసుకోవాల్సి వచ్చింది.

భారతీయ జనతాపార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమానికి మద్దతునిచ్చింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగే ఉద్యమంలో బీజేపీ నాయకత్వం పూర్తిగా మమేకమైంది. భిన్నమైన సిద్ధాంతాలు, వామపక్ష భావజాల పార్టీలు ఉన్నప్పటికీ భారతీయ జనతాపార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని జేఏసీలో బీజేపీ చేరింది. జాతీయ పార్టీగా జేఏసీలో కీలక పాత్ర పోషించింది.

జేఏసీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ప్రజలను చైతన్యపరిచేందుకు భారతీయ జనతాపార్టీ కృషి చేసింది. బండారు దత్తాత్రేయ నాయకత్వంలో 2008లో తెలంగాణ సంకల్పయాత్ర నిర్వహించింది. జేఏసీ పోరాటాల్లో బీజేపీ కీలక పోషించింది. మిలియన్‌ మార్చ్‌, సకల జనుల సమ్మె, వంట వార్పు, రైల్‌రోకోలు, బంద్‌లు, రహదారి దిగ్భందాలు ఇలా అన్నీ పోరాటాల్లో బీజేపీ నాయకులు ప్రధాన పోషించారు. 

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న క్రమంలో ఆనాడు అధికారంలో ఉన్న పార్టీ అణిచివేతకు దిగింది. సకల జనుల సమ్మెను అర్థాంతరంగా విరమించిన సందర్భంగా ప్రజలంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ సందర్భంలో ప్రజలకు భరోసానిస్తూ ‘తెలంగాణ పోరు యాత్ర’ను బీజేపీ చేపట్టింది. 2012లో ఆనాటి రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి నేతృత్వంలో986 గ్రామాలలో, 3500 కిలోమీటర్లు ఈ యాత్ర జరిగింది. 

22 రోజుల పాటు జరిగిన ఈ యాత్రను ఆనాటి జాతీయ అధ్యక్షులు నితిన్‌ గడ్కరి ప్రారంభించి తెలంగాణ ఏర్పాటుకు సహకరిస్తామని, పార్లమెంట్‌లో బిల్లు ఎప్పుడు పెట్టినా ఎన్‌డీఏ మిత్రపక్షాల ఎంపీలందరమూ పూర్తి మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. గతంలో కూడా బీజేపీ జాతీయ అధ్యక్షులు రాజ్‌నాథ్‌సింగ్‌ బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తెలంగాణ ఇస్తామని ప్రకటించారు. 

అదే విధంగా తెలంగాణ అంశం పార్లమెంట్‌లో ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారి ప్రతిపక్ష హోదాలో బీజేపీ నాయకులు దివంగత సుష్మస్వరాజ్‌ తెలంగాణకు మద్దతుగా తన గళాన్ని వినిపించే వారు. తెలంగాణ ఉద్యమం ఉధృతమయినప్పటికీ ప్రభుత్వం పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టడానికి చొరవ చూపలేదు.

భారతీయ జనతాపార్టీ తెలంగాణ ఉద్యమ కమిటీని ఏర్పాటు చేసి విద్యాసాగర్‌రావును చైర్మన్‌గా నియమించింది. ఆయన నేతృత్వంలో ‘వంద రోజుల్లో తెలంగాణ’ నినాదంతో పల్లె పల్లెన కార్యక్రమాలు చేపట్టాము. తెలంగాణ ఉద్యమంలో నేనూ మొదటి నుంచి భాగస్వామిగాఉన్నాను. 

మరో వైపు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు భారతీయ జనతాపార్టీ నేతృత్వంలో పార్లమెంట్‌ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా వేలాది కార్యకర్తలు ఢిల్లీకి చేరుకుని ఉద్యమించారు. ఈ ఉద్యమాన్ని అణిచి వేసేందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం పోలీసులతో, గుర్రాలతో తొక్కించి అమానుషంగా ప్రవర్తించడంతో వందలాది కార్యకర్తల కాళ్లు చేతులు విరిగాయి.

అనాటి అధ్యక్షులు కిషన్‌రెడ్డి కన్నుకు తీవ్ర గాయమయింది. నేను సైతం తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాను. వేలాది కార్యకర్తలను అరెస్టు చేశారు. ఆ తరువాత 72 గంటల దీక్షను జంతర్‌ మంతర్‌ వద్ద బీజేపీ చేపట్టింది. ఈ దీక్షకు బీజేపీ జాతీయ నాయకత్వం కదిలి వచ్చింది. ఎల్‌కె ఆడ్వాణీ, సుష్మస్వరాజ్‌ తదితర అగ్రనేతలంతా హాజరై మద్దతు పలికారు.

ప్రజా ఉద్యమానికి తలొగ్గి అప్పటి ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రత్యేక రాష్ట్ర బిల్లును ప్రవేశపెట్టింది. అంబేడ్కర్‌ ఆలోచన విధానాన్ని కొనసాగిస్తూ, అమలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ చిన్న రాష్ట్రాల ఏర్పాటునకు అనుకూలంగా తాను నిబద్ధమైన విధానాన్ని మరోసారి పార్లమెంటు సాక్షిగా నిరూపించుకున్నది.

వాదోపవాదనల మధ్య పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసింది. తద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. భారతీయ జనతాపార్టీ ఓటు వేయకపోయినట్లయితే తెలంగాణ కల సాకారమయ్యేదే కాదు. నాటి నుంచి నేటి వరకు బీజేపీ ప్రజా ఉద్యమాలకు మద్దతునిస్తూ ప్రజా ఆకాంక్షలను నెరవేరుస్తున్నది. తెలంగాణ ఏర్పాటు తరువాత ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడుత్నుది.

1969 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు జరిగిన అనేక ఉద్యమాల్లో ప్రజలు స్పష్టమైన ఉద్యమ ఆకాంక్షను తెలిపారు. వాటిలో ప్రధానంగా ఉద్యోగ నియామకాలు, నీళ్లు, నిధులు, ఆత్మగౌరవం ఉన్నాయి. వేలాది మంది ఆత్మబలిదానాల తరువాత ఏర్పడిన తెలంగాణను ప్రజల ఆకాంక్ష మేరకు పాలన సాగించడంలో కేసీఆర్‌ విఫలమయ్యారు. 

ప్రజల ఎజెండానే తన ఏజెండాఅని ప్రకటించిన కేసీఆర్‌ భవిష్యత్‌ తెలంగాణను బంగారు తెలంగాణగా పోల్చారు. కానీ ఆచరణలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 1.5లక్షల ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో నిరుద్యోగుల ఆశలు అడియాశలయ్యాయి. 

ఏడేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్‌ ప్రజల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీశారు. అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తూ అధికారాన్ని కుటుంబానికి పరిమితం చేసుకున్నాడు. కుటుంబ పాలన చేస్తున్నారు. ఉద్యమకారుల పట్ల నిర్లక్ష్యంచూపుతున్నారు. తెలంగాణ వ్యతిరేకులను అందలమెక్కించారు. 

ఉద్యమకారుడని అధికారం ఇస్తే గడీల పాలనను తిరిగి తీసుకువచ్చారు. ప్రజల ఇబ్బందులు పరిష్కరించేందుకు కృషి చేయడం లేదు. ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు కేసీఆర్‌ సవ్యమైన ప్రజాపాలన అందించడంలో ఘోరంగా విఫలమయ్యారు. 

తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు భారతీయ జనతాపార్టీ కట్టుబడి ఉంది. అందు కోసం తొలి, మలి దశ ఉద్యమ ఆకాంక్షలను భారతీయ జనతాపార్టీ మాత్రమే నెరవేర్చగలదు. కేసీఆర్‌ ప్రజా వ్యతిరేక పాలనపై బీజేపీ నిరంతర పోరాటాలు కొనసాగిస్తుంది. 2023లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రజలు కోరుకున్న పాలనను అందిస్తుంది. సకల జనుల కలలను సాకారం చేస్తుంది. 

(ఆంధ్రజ్యోతి నుంచి)