వైసిపి రెండేళ్ల అసమర్ధ, అవినీతి పాలన: బిజెపి 

అసమర్ధతపాలన, అవినీతి, అధికార దుర్వినియోగం. అప్పులు. ప్రతిపక్షాలపై కక్షసాధింపు, మతమౌఢ్యం, తొందరపాటు నిర్ణయాలతో వైసిపి రెండేళ్ల పాలన కొనసాగిందని బిజెపి రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు విమర్శించారు. 

నరేంద్ర మోదీ రెండువిడతల్లో ఏడేళ్ల పాలన అద్భుతంగా అభివృద్ధితో, అత్యంత పారదర్శకంగా, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా, దేశానికి ప్రపంచంలో ప్రతిష్ట పెరిగేలా సాగితే రాష్ట్రంలో రెండేళ్ల వైసిపి పాలన పూర్తి విరుద్దంగా సాగిందని ధ్వజమెత్తారు. వైసిపి ప్రభుత్వం తన ధోరణి మార్చుకోక ఇలాగే కొనసాగిస్తే టిడిపికి పట్టిన గతే ఆ ప్రభుత్వానికి పడుతుంది హెచ్చరించారు. 

రాష్ట్రంలో అభివృద్ధి. అన్ని సామాజిక వర్గాలకు సముచిన న్యాయం జరగాలంటే బిజెపి- జనసేన ప్రభుత్వం వల్లే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. వైసిపి పాలనపై ఆయన ప్రధానంగా మూడు అంశాలు ప్రస్తావించారు. 

పరిపాలన తక్కువ- ప్రతీకారధోరణి ఎక్కువ

ఈ ప్రభుత్వం పరిపాలన తక్కువ- ప్రతీకారధోరణి ఎక్కువ అనే రీతిలో సాగింది. ప్రతిపక్షాలపై కక్షసాధింపు ధోరణినే ఈ ప్రభుత్వం రెండేళ్లుగా ప్రదర్శించింది. గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికితీసి దోషులను పట్టుకోవాలి. కాని ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అవినీతిని బయటపెట్టకుడా కక్షసాధింపుకే ప్రాధాన్యత ఇచ్చింది. 

పోలవరం, అమరావతి నిర్మాణాల్లో అవినీతి జరిగింది. అభివృద్ధి లేకుండా వేలకోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది. వీటి గురించి స్పష్టంగా వైసిపి ప్రభుత్వాన్ని అడిగాం. కాని విచారణ చేపట్టి కూడా ఫలితం లేదు. అవినీతిపై పుస్తకాలు రాసినప్పటి శ్రద్ధ దోషులను పట్టుకోవడంలో చూపించడం లేదు. 

అవిరీతిపై టిడిపి, వైసిపి రెండూ లోపాయకారి ఒప్పందం చేసుకుని ప్రజలను మభ్యపెడుతున్నాయి. గత ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతి చేస్తే ఈ ప్రభుత్వం పద్ధతి. కొత్త ధోరణితో అవినీతిని కొనసాగిస్తోంది. తన కక్షసాధింపు చర్యలకు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుని దుర్వినియోగపరుస్తోంది. వందలాది ఆలయాలను ధ్వంసం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. పోలీసులు దోషులను పట్టుకోవడంలో శ్రద్ధ చూపలేదు.

అభివృద్ధి శూన్యం- అప్పులు ఎక్కువ

ఈ ప్రభుత్వం రెండేళ్లుగా అభివృద్ధి అనే మాటనే మరచిపోయింది. అసలు అభివృద్ధి అనేది శూన్యంగా కనిపిస్తోంది. అభివృద్ధిని పక్కనపెట్టి సంక్షేమ పథకాల పేరుతో నగదు పంచుతూ ఓటు బ్యాంకు రాజకీయాలను పాల్పడింది. వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులాంధ్రగా మార్చారు. 

గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలసి ఆర్ధిక క్రమశిక్షణ లేకుండా అప్పులు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని దివాళీ తీయించారు. గత ప్రభుత్వం చేసిన దుర్వినియోన్ని సరిదిద్దకుండా ఈ ప్రభుత్వం ఇంకా రూ.1.50 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజల్ని ముంచింది.

అవగాహన ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ

ఈ ప్రభుత్వం ఆలోచన లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ పలుమార్లు భంగపాటుపడుతూ వస్తోంది. అవగాహన లేని పాలనతో ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుని అనేక సంస్థలతో ఢీకొని బోర్లాపడింది. పంచాయతీ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలకు కోట్లు ఖర్చుచేసి తమ పార్టీ రంగులు వేయడాన్ని కోర్టులు తప్పు పట్టినా సమర్ధించుకుంది. 

ఇప్పుడు ఆలయాలకు కూడా పార్టీ రంగులు వేయడం వైసిపి అహంకార ధోరణకి పరాకాష్టగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఏడేళ్లలో జరిగిన అభివృద్ధి అంతా మోదీ ప్రభుత్వం చేసిందే. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కింద రూ 8.16 లక్షల కోట్ల మౌలికసదుపాయాల అభివృద్ధి పనులు రాష్ట్రంలో జరుగుతున్నాయి. 

రూ.14,630 కోట్లతో రాష్ట్రంలో 872 కి.మీ. జాతీయ రహదారులు నిర్మించేందుకు జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ అనుమతిని ఇటీవల ఇచ్చింది. ఇవి కాక రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన మౌలికసదుపాయాల పనులు, గృహ నిర్మాణం, పారిశుధ్య పనులు, నరేగా పనులు, నీటి కనెక్షన్ పనులు అన్నీ కేంద్రం అందచేసే పథకాల ద్వారా జరుగుతున్నవే. 

జాతీయ విద్యాసంస్థలను నిర్మించింది. కేంద్రం 5 పారిశ్రామిక వాడలను రాష్ట్రానికి కేటాయించింది. కృష్ణపట్నం ఇన్ఫ్రా డెవలెప్ మెంట్ కు 4 నెలల క్రితం కేంద్రం అనుమతులు ఇచ్చింది.