కొత్త ఐటీ రూల్స్‌కు ఎట్టకేలకు ట్విట్టర్ ఓకే

సామాజిక మాధ్యమాల కట్టడికి కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఐటీ విధానాలకు ట్విట్టర్ యాజమాన్యం ఎట్టకేలకు అంగీకరించింది. ఈ చట్టం ప్రకారం ట్విట్టర్‌కు ప్రభుత్వానికి అనుసంధానంగా ప్రత్యేక అధికారిని మే 28న నియమించినట్లు సోమవారం ఢిల్లీ హైకోర్టు ముందు వివరణ ఇచ్చింది. 

ఇప్పటికే ఫేస్‌బుక్ సహా పలు సోషల్ మీడియా, ఓటీటీ సంస్థలు ఈ నియమావళిని అంగీకరించాయి. అయితే వీటిలో కొన్ని మార్పులు చేయాలంటూ ప్రతిపాదనలు పెట్టాయి. అయితే ఈ విషయంలో ట్విట్టర్ యాజమాన్యం కాస్త మొండిగా వ్యవహరించింది.

సామాజిక మాధ్యమాల కట్టడికి మూడు నెలల క్రితం, అంటే ఫిబ్రవరి 25న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వాటి అమలుకు కేంద్రం ఇచ్చిన మూడు నెలల గడువు మే 25తో ముగియడంతో కేంద్ర ప్రభుత్వం మే 26న రంగంలోకి దిగింది. సవరించిన నిబంధనల అమలుకు సామాజిక మాధ్యమాలు తీసుకున్న చర్యలేంటో చెప్పాలని ప్రశ్నించింది. 

అయితే అప్పటి వరకు మౌనంగా ఉన్న ఫేస్‌బుక్ ఉన్నట్లుండి కేంద్ర నియమావళికి ఓకే చెప్పేసింది. అయితే ఇదే సమయంలో ట్విట్టర్ కార్యాలయంలో ఢిల్లీ పోలీసులు తనిఖీకి రావడం సంచలనంగా మారింది. అనంతరం తమ ఉద్యోగుల భద్రతపై, వాక్స్వాతంత్ర్యానికి కలుగుతున్న ముప్పుపై ఆందోళన కలుగుతోందని ట్విట్టర్ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ ప్రకటనపై కేంద్రం ఘాటుగా స్పందించింది. ట్విటర్‌ చేసిన ప్రకటన భారతదేశాన్ని అపఖ్యాతిపాలు చేసేవిధంగా ఉందని, ఇది ప్రపంచంలోనే  అతి పెద్ద ప్రజాస్వామ్యంపై తన షరతులను రుద్దే ప్రయత్నమని మండిపడింది. ట్విటర్‌ నేరుగా విషయానికి రావాలని  ఈ దేశ చట్టాలకు లోబడి పని చేయాలని సూచించింది. అంతేకాదు లద్దాఖ్‌ను చైనాలో భాగంగా చూపే ట్వీట్లను తొలగించడానికి గతంలో ట్విటర్‌ తాత్సారం  చేసిందని గుర్తుచేసింది.