దీదీ తీరు ప్ర‌జాస్వామ్యానికి గొడ్డలిపెట్టు 

యాస్ తుఫాన్ పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌మావేశానికి హాజ‌రు కారాద‌ని ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తీసుకున్న నిర్ణ‌యాన్ని బీజేపీ అధ్యక్షుడు జేపీ న‌డ్డా త‌ప్పుప‌ట్టారు. దీదీ తీరు ప్ర‌జాస్వామ్యానికి గొడ్డలిపెట్ట‌ని విమర్శించారు. 

బెంగాల్ సీఎం చిల్ల‌ర రాజ‌కీయాలు, వ్యూహాలు మ‌రోసారి రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజనాల‌కు విఘాతం క‌లిగించేలా ఉన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. యాస్ తుఫాన్ తో న‌ష్ట‌పోయిన బెంగాల్ ప్ర‌జ‌లకు ప్ర‌ధాని మోదీ గ‌ట్టి భ‌రోసా ఇస్తూ ముందుకు రాగా, మ‌మ‌తా బెన‌ర్జీ సైతం ప్ర‌జ‌ల కోసం ప‌ట్టింపుల‌ను ప‌క్క‌న‌పెట్టి హుందాగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంద‌ని న‌డ్డా విచారం వ్యక్తం చేశారు.

 ప్ర‌ధాని స‌మావేశానికి దీదీ గైర్హాజ‌ర‌వ‌డం రాజ్యాంగ విలువ‌ల‌ను కాల‌రాయ‌డ‌మేన‌ని, స‌హ‌కార స‌మాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడ‌వ‌డ‌మేన‌ని మండిపడ్డారు. మమత బెనర్జీ తన అహంకారాన్ని పక్కన పెడితే బాగుంటుందని సూచించారు. యాస్ తుపాను విషయంలో ప్రజలకు మేలు చేయడానికి పార్టీల కతీతంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చిస్తూనే ఉన్నారని నడ్డా పేర్కొన్నారు.

‘‘ఎస్ తుపానును దృష్టిలో పెట్టుకొని ప్రధాని మోదీ బెంగాల్  ప్రజలకు మద్దతుగా నిలుస్తున్నారు. అటు సీఎం మమత కూడా ప్రజా క్షేమం దృష్ట్యా అహంకారాన్ని పక్కన పెట్టాలి” అంటూ హితవు చెప్పారు. మమత అహంకార రాజకీయాలు మరోసారి బెంగాల్ ప్రజలకు నష్టం వాటిల్లేలా చేస్తున్నాయని అంటూ నడ్డా సీఎం మమతపై విరుచుకుపడ్డారు.

కాగా, ప్రధాని సమీక్షకు మమతా గైరాజరు కావడం పట్ల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కూడా మండిపడ్డారు. ఆమె ప్రజా సంక్షేమంకన్నా తన అహంకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు.