అల్లోప‌తితోనే క‌రోనా పూర్తి నివార‌ణ పెద్ద అబ‌ద్ధం

అల్లోప‌తి వైద్యుల చికిత్స వ‌ల్లే క‌రోనా పూర్తిగా న‌యం అవుతుంద‌ని చెప్ప‌డం ప్ర‌పంచంలోకెల్లా అతిపెద్ద అబ‌ద్ధం అని  యోగా గురు రాందేవ్ బాబాకు స్పష్టం చేశారురు. వైద్యులు చాలా చేస్తున్నార‌ని తాను అంగీక‌రిస్తాన‌ని, కానీ అంతా వారే చేస్తున్నారనడం స‌రి కాద‌ని తేల్చి చెప్పారు.

ఆక్సిజ‌న్ లెవెల్స్ 70 శాతానికి ప‌డిపోయిన రోగులు యోగా, నేచురోప‌తి విధానాల‌తో కోలుకున్నార‌ని గుర్తు చేశారు. అల్లోప‌తి వైద్యులు కేవ‌లం ప‌రిస్థితి విష‌మించిన రోగుల‌కు మాత్ర‌మే చికిత్సనందిస్తున్నార‌ని చెప్పారు. ఎయిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ గులేరియా కూడా 90 శాతం రోగులు ద‌వాఖాన‌కు వెళ్ల‌న‌వ‌స‌రం లేద‌న్నార‌ని రాందేవ్ గుర్తు చేశారు.

95-98 శాతం మంది ద‌వాఖాన‌ల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని తానూ చెబుతున్నాని తెలిపారు. తాను అల్లోప‌తి వైద్యానికి విరోధిని కాద‌ని రాందేవ్ బాబా స్పష్టం చేశారు. అత్య‌వ‌స‌ర చికిత్స, సీరియ‌స్ స‌ర్జ‌రీల విష‌య‌మై ఆధునిక వైద్య చికిత్స‌ల కోసం ఆధునిక వైద్య‌శాస్త్రం ఎంతో చేసింద‌ని కొనియాడారు.

కానీ జీవ‌న విధాన వ్యాధుల చికిత్స‌కు వారి వ‌ద్ద ఎటువంటి చికిత్స లేద‌ని యోగా గురు కొట్టి పారేశారు. 90% మంది క‌రోనా రోగులు యోగా-ఆయుర్వేదంతోనే కోలుకుంటున్నార‌ని ఓ జాతీయ‌ దిన‌ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పడంతో ఇండియన్ మెడికల్ అస్సోసియేషన్ (ఐఎంఏ_కు, రాందేవ్‌కు మ‌ధ్య మాట‌లు, ఆరోప‌ణ‌లు-ప్ర‌త్యారోప‌ణ‌ల ప‌ర్వం సాగుతుండడం తెలిసిందే.

25 ర‌కాల వ్యాధుల‌కు అల్లోప‌తిలో శాశ్వ‌త చికిత్స ఎందుకు లేద‌ని ఈ సందర్భంగా  రాందేవ్ బాబా ప్ర‌శ్నించారు. దీనిపై ఆగ్ర‌హించిన ఐఎంఏ.. ఆయ‌న‌పై దేశ‌ద్రోహ కేసు న‌మోదు చేయాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని కోరింది. ప్ర‌స్తుత విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల‌కు యోగా-నేచురోప‌తి అత్యంత అవ‌స‌రం అని రాందేవ్ చెప్పారు. క‌రోనా నివార‌ణ కోస‌మే అల్లోప‌తికి వ్య‌తిరేకంగా మాట్లాడాన‌ని తెలిపారు.

ఊపిరితిత్తులు, కాలేయం, గుండె, రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌, న‌రాల వ్య‌వ‌స్థ, నైతిక‌త‌ను వైర‌స్ బ‌ల‌హీన ప‌రుస్తుంద‌ని చెబుతూ దుర‌ద్రుష్ట‌వ‌శాత్తు అల్లోప‌తి వైద్యం దీన్ని న‌యం చేయ‌లేక‌పోతున్న‌ద‌ని పేర్కొన్నారు. 

త‌మ సంస్థ క‌రోనిల్ మందును ప్ర‌భుత్వ హోంకిట్‌లో చేర్చ‌క‌పోవ‌డం త‌మ త‌ప్పిదం కాద‌ని, ప్ర‌భుత్వ విధానాల లోపం అని రాందేవ్ తెలిపారు. 90 మంది రోగులు యోగా, ప్రాణాయామం, ఆరోగ్య జీవ‌న విధానం, ఆయుర్వేద ప‌ద్ద‌తుల్లో చికిత్స ద్వారా కోలుకున్నార‌ని గుర్తు చేశారు. త‌న శ‌క్తి ఆర్థిక శ‌క్తి కాద‌ని పేర్కొంటూ వైద్యులు, బిజినెస్‌తో చికిత్స‌ను క‌లిపేస్తున్నార‌ని విమర్శించారు. ఫార్మా-హాస్పిట‌ల్ రంగ ప‌రిశ్ర‌మ‌ల బిజినెస్ ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.200 ల‌క్ష‌ల కోట్లు ఉంటుంద‌ని తెలిపారు.

త‌మ క‌రోనిల్‌కు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) గుర్తించ‌లేద‌ని రాందేవ్ అంగీక‌రించారు. డ‌బ్ల్యూహెచ్‌వో ప్ర‌క్రియ విభిన్న‌మైంద‌ని చెబుతూ భార‌త్ బ‌యోటెక్ వారి కొవాగ్జిన్‌ను కూడా ఇంకా గుర్తించ‌లేద‌ని తెలిపారు. అయితే కేంద్ర ఆయుష్ మంత్రిత్వ‌శాఖ త‌మ మందుకు గుర్తింపునిచ్చింద‌ని చెప్పారు.