ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ మెరుపు ధర్నా

ప్రధాని  నివాసం వద్ద రాహుల్ గాంధీ మెరుపు ధర్నా
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద మంగళవారం సాయంత్రం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు ఐదు డిమాండ్లతో ప్రధాని ఇంటి ముందు బైఠాయించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ తదితరులు  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  స్వతంత్ర భారత చరిత్రలోనే  ప్రధాని నివాసం ముందు ప్రతిపక్ష నేత నిరసన తెలపడం బహుశా ఇదే మొదటిసారిగా భావిస్తున్నారు. 
 
సుమారు మూడున్నర గంటలపాటు బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కేంద్రమంత్రి జితేంద్రసింగ్ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో చర్చలు జరిపి ధర్నా విరమించాలని కోరారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందేనని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. అనంతరం పోలీసులు కాంగ్రెస్ నేతలను బలవంతంగా అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. అయితే, ఈ సమయంలో రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. ఆ తర్వాత రాత్రి సమయంలో అదుపులోకి తీసుకున్న నేతలను అందరిని విడిచిపెట్టారు.
 
కాంగ్రెస్ నిరసన ప్రదర్శనకు సంఘీభావం తెలిపిన సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం నీట్‌ అక్రమాలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా కాంగ్రెస్‌ నేతలు ప్రధాని మోదీ నివాసం వద్ద మెరుపు ధర్నాకు దిగారు.  విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 
 
ఈ ధర్నాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, కేరళ సీఎం సతీశన్‌, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరనసగా చేతులకు తాళ్లు కట్టుకొని ఆందోళన వ్యక్తం చేశారు. దీనితో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను, ప్రత్యేక బలగాలను మోహరించారు. 
 
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్వయంగా వచ్చి మాట్లాడినా, బుజ్జగించే ప్రయత్నం చేసినా రాహుల్ వినలేదు. అక్కడి నుంచి నేరుగా హోంమంత్రి అమిత్ షా దగ్గరకు వెళ్లిన జితేంద్ర మళ్లీ రాహుల్‌తో మాట్లాడే ప్రయత్నం చేసినా ఆయన తాము ఇక్కడి నుంచి కదలం అని భీష్మించుకున్నారు. దాంతో, రంగంలోకి దిగిన పోలీసులు రాహుల్‌ సహా కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, కార్యకర్తలను ప్రధాని నివాసం ముందు నుంచి తరలించారు. 
 
విద్యార్థులు, నిరసనకారులపై పోలీసులు పాల్పడినట్లుగా ఆయన పేర్కొన్న “అరాచకాల”పై సమాధానం కోరేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రధాని నివాసానికి ర్యాలీగా వెళ్లిందని గాంధీ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ఈ ఘటనకు బాధ్యత వహించడానికి లేదా పార్లమెంటులో దీనిపై చర్చకు అనుమతించడానికి ప్రభుత్వం నిరాకరిస్తోందని ఆయన ఆరోపించారు; అలాగే, ప్రధాని, హోంమంత్రి రాజీనామా చేయాలన్న తన డిమాండ్‌ను మరోసారి పునరుద్ఘాటించారు.
 
ఢిల్లీ పోలీసులు తమను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మోదీ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. “వారు పిరికివారు. వారికి భయం వేస్తోంది. మాకు వారిని చూసి భయం లేదు. వారికే మమ్మల్ని చూసి భయం వస్తుంది” అంటూ ధ్వజమెత్తారు.