ప్రధాని ఇంటి సమీపంలో రాహుల్‌గాంధీ ధర్నా చేసిన సంఘటన తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. నెలరోజులకు పైగా సిపిజే ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా జరుగుతున్నా పట్టించుకోని రాహుల్ గాంధీ అకస్మాత్తుగా ప్రధాని ఇంటి ముందు ధర్నాకు ఉపక్రమించడం పట్ల కేంద్ర మంత్రులు ధ్వజమెత్తారు. పార్లమెంట్ లో చర్చకు ప్రభుత్వం అంగీకరిస్తే ధర్నా విరమిస్తామని హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ, అందుకు ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాత మాట మార్చారని కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్ మండిపడ్డారు.
రాహుల్ గాంధీ విద్యార్థులను `రాజకీయ పావులు’గా వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.
” కాంగ్రెస్ నేతలతో చర్చించాలని ప్రభుత్వం నన్ను పంపించింది. నేను వెళ్లి ధర్నా చేసేందుకు ఇది సరైన వేదిక కాదని రాహుల్ గాంధీకి చెప్పాను. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని కోరాను. దీనితో నీట్ అక్రమాలు, దానిపై జరుగుతున్న ఆందోళనలు సహా అన్ని అంశాలపై పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించాలని రాహుల్ గాంధీ కోరారు” అని తెలిపారు.
“ఇందుకు ప్రభుత్వం అంగీకరిస్తే, వెంటనే తమ నిరసనలను విరమిస్తామని నాకు చెప్పారు. నేను ప్రభుత్వాధినేతలకు ఆ విషయం చెప్పి, వారి అభిప్రాయాలను తెలుసుకొన్న కొద్ది సేపటిలోనే రాహుల్తో మాట్లాడాను. నీట్, దానికి సంబంధించిన ఉద్యమాలు, ఇతర విషయాలపై పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాహుల్ గాంధీకి హామీ ఇచ్చాను. ఇది విన్న రాహుల్ గాంధీ దీనికి మాత్రమే తాను అంగీకరించనని చెబుతూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కూడా హామీ కావాలని కోరారు” అని వెల్లడించారు.
“అంతకు ముందు కేవలం చర్చ జరగాలని మాత్రమే మీరు డిమాండ్ చేశారని గుర్తు చేశాను. దానికి ఆయన ఇప్పుడు తన డిమాండ్లు మారాయని అన్నారు. రాహుల్ లాంటి నేత తన మాట తప్పడం దురదృష్టకరం, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం” అని జితేంద్ర సింగ్ విమర్శించారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాహుల్ గాంధీ విద్యార్థులను ‘రాజకీయ సాధనాలుగా’ వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ వివాదంపై తన తొలి స్పందనలో, నీట్ పేపర్ లీక్ అంశంపై ఉన్న ఆందోళనలను నిర్మాణాత్మకంగా పరిష్కరించడానికి బదులుగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ అంతరాయం సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ప్రధాన్ ఆరోపించారు.

More Stories
ఖతార్ ఇస్లామిక్ ఉగ్రవాదానికి మూలకేంద్రం
అస్సాంలో తీవ్రరూపం దాల్చిన వరదలు… 31 మంది మృతి
ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ మెరుపు ధర్నా