టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులతో స్మృతి మందాన సంచ‌ల‌నం

టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులతో స్మృతి మందాన సంచ‌ల‌నం

భారత మహిళల క్రికెట్ స్టార్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మరో చారిత్రాత్మక మైలురాయిని అందుకుంది. ఏషియన్ గేమ్స్ 2026 సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై మెరుపు బ్యాటింగ్‌తో విరుచుకుపడిన ఆమె, మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఆల్ టైమ్ హైయెస్ట్ రన్ స్కోరర్‌గా అవతరించింది. న్యూజలాండ్ దిగ్గజ ప్లేయర్ సూజీ బేట్స్ పేరిట ఉన్న 4,758 పరుగుల ఆల్ టైమ్ రికార్డును దాటేసి అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అవతరించింది.

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో పురుషులు, మహిళల క్రికెట్‌లో కలిపి అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఆసియా క్రీడల సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌ తో జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనతను ఆమె సొంతం చేసుకుంది. కొరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా జరిగిన ఈ నాకౌట్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన స్మృతి మంధాన ఆరంభం నుంచే బంగ్లాదేశ్ బౌలర్లపై విరుచుకుపడింది.

 కేవలం 19 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేసి దాదాపు 200 స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టింది. పవర్ ప్లే ఆఖరి బంతికి ఔట్ అయింది. షెఫాలీ వర్మతో కలిసి తొలి వికెట్‌కు కేవలం 6 ఓవర్లలోనే 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాకు అదిరిపోయే పునాది వేసింది. ఈ మ్యాచ్‌కు ముందు మంధాన 170 ఇన్నింగ్స్‌లలో 4,751 పరుగులతో రెండో స్థానంలో ఉండగా రికార్డు బ్రేక్ చేయడానికి కేవలం 8 పరుగులు అవసరమయ్యాయి. 

తన ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు ఫోర్లు, రెండు సింగిల్స్‌తో ఈ మార్కును సులభంగా దాటేసింది. తాజా రికార్డుతో మంధాన 171 ఇన్నింగ్స్‌లలో 4,788 పరుగులతో అగ్రస్థానానికి చేరుకుంది.  ఈ జాబితాలో మంధాన, సూజీ బేట్స్ (4,758) తర్వాత పురుషుల టీ20ల్లో అగ్రగామిగా ఉన్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం (4,596) మూడో స్థానంలో ఉన్నాడు. వీరి తర్వాత జోస్ బట్లర్ (4,292), భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (4,287) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. 

ఈ రికార్డుతో మంధాన పురుషుల క్రికెట్‌లోని అగ్రశ్రేణి ఆటగాళ్లను కూడా వెనక్కి నెట్టింది. భారత జట్టు తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతూ పవర్‌ప్లేలో వేగంగా పరుగులు సాధించడమే కాకుండా, ఇన్నింగ్స్‌ను ఎక్కువ సేపు కొనసాగించే సామర్థ్యంతో ఆమె ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

స్మృతి మంధానకు ఈ మధ్యకాలంలో ఇది రెండో అతిపెద్ద మైలురాయి. కేవలం కొన్ని రోజుల క్రితమే భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ పేరిట ఉన్న 10,868 అత్యధిక అంతర్జాతీయ పరుగుల రికార్డును దాటేసి, అన్ని ఫార్మాట్లలో కలిసి భారతదేశం తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. ఇప్పుడు టీ20ల్లో ప్రపంచంలోనే ఏకైక టాప్ రన్ స్కోరర్‌గా నిలిచి తన సత్తా చాటింది.

ఇటీవలి కాలంలో స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా పలు రికార్డులను అందుకుంటున్నారు. టీ20 ఫార్మాట్‌లో భారీ స్కోర్లు చేయడంతో పాటు, కీలక మ్యాచ్‌ల్లో జట్టుకు శుభారంభాలు అందించడం ఆమె ప్రత్యేకత. ఆమె బ్యాటింగ్‌ ప్రదర్శనలు భారత మహిళల జట్టుకు విజయాల్లో కీలకంగా మారుతున్నాయి.