బిజెపి వైపు అడుగులు వేస్తున్న ఈటెల రాజేందర్!

భూకబ్జా ఆరోపణలతో కేసీఆర్ మంత్రివర్గం నుండి బహిష్కరణకు గురైన ఈటెల రాజేందర్ బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు. మరో  వారం రోజులలో ఆయన బీజేపీలో అధికారికంగా చేరే  అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయిన ఇప్పటికే పలువురు బిజెపి నేతలతో సుదీర్ఘంగా మంతనాలు జరపడం, బిజెపి నేతలు సహితం ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి సుముఖంగా ఉండడంతో అందుకు సానుకూల వాతావరణం ఏర్పడినట్లు తెలుస్తున్నది. 

తొలుత సొంతంగా ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేసినప్పటికీ గతంలో ఆ టి ఆర్ ఎస్ కు వ్యతిరేకంగా ఆ విధమైన ప్రయత్నాలు చేసిన వారెవ్వరూ విజయంవంతం కాకపోవడంతో వెనుకడుగు వేస్తున్నట్లు చెబుతున్నారు. 

కాంగ్రెస్ లో చేరమని ఆ పార్టీ నాయకులు బలమైన వత్తిడి తెస్తున్నప్పటికీ తెలంగాణలో ఆ పార్టీ భవిష్యత్ పట్ల ఈటెలకు భరోసా ఏర్పడటం లేదని తెలుస్తున్నది. ఈటలతో పాటు  మరికొందరు టీఆర్ఎస్‌ నేతలు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు ఈ సందర్భంగా ప్రచారం జరుగుతున్నది.

ఈటెల రాజేందర్ తో పాటు టీఆర్ఎస్‌లో ఉన్న అసంతృప్త నేతలను కూడా పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అందుకు పార్టీ కేంద్ర నాయకుల నుండి కూడా సుముఖత వ్యక్తమైన్నట్లు తెలుస్తున్నది. తెలంగాణ ఉద్యమకారులను బీజేపీలో వైపు తిప్పుకోవాలని సంజయ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.  అన్నీ అనుకున్నట్లు జరిగితే బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా సమయం ఇవ్వగానే ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. 

గతవారం రాజేందర్‌  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కలిశారు. కిషన్‌రెడ్డిని తాను కలిసింది నిజమేనని ఈటల రాజేందర్‌ అంగీకరించారు కూడా. ఒక్క కిషన్‌రెడ్డినే కాదని, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ని కూడా కలిసినట్లు తెలిపారు. మరో కొందరు బిజెపి నాయకులతో సహితం ఆయన సుదీర్ఘంగా సమాలోచనలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. దానితో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈటల బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఈ పరిణామాలను నిశితంగా పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఈటలతో రాయబారం నడిపారు. ఆయన కాంగ్రెస్ లో చేరాక పోయినా ఎలాగైనా బీజేపీలో చేరకుండా అడ్డుకోవాలని ఆ పార్టీ ఎంపీ ఎ రేవంత్‌రెడ్డి  తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి కొందరు దూతలను రాజేందర్ దగ్గరకు పంపారు.

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కూడా  ఈటలతో మంతనాలు జరిపారు. బీజేపీలో వద్దని,  కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసే ఐక్య వేదికకు కోసం కలిసి రావాలని కోదండరాం బలమైన వత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు.  అయితే ఈ రాయబారం విఫలమిస్తోన్నట్లు తెలుస్తున్నది.

బీజేపీలో చేరిక నిర్ణయాన్ని మార్చుకునేది లేదని ఈటల వారందరికీ తెగేసి చెప్పిన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణాలో టి ఆర్ ఎస్ ను ఎదిరించి, నిలదొక్కుకోగల సామర్ధ్యం బిజెపికి మాత్రమే ఉన్నదనే భరోసాతో ఈ విషయమై ఈటెల తన మద్దతు దారులతో సమాలోచనలు జరుపుతున్నారు.