తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలకు రూ 1,000 కోట్ల తక్షణ సహాయం 

యాస్ తుఫాన్ కు అల్లకల్లోలంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్  లకు తక్షణ సహాయంగా రూ 1,000 కోట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అందులో రూ.500 కోట్లు ఒడిశా రాష్ట్రానికి, మ‌రో రూ.500 కోట్ల ఆర్థిక సాయాన్ని ప‌శ్చిమ‌బెంగాల్‌, జార్ఖండ్ రాష్ట్రాల‌కు కేటాయించిన‌ట్లు తెలిపారు.

తుఫాన్ కార‌ణంగా జ‌రిగిన న‌ష్టాన్ని ఆధారంగా చేసుకుని ఈ సాయం ప్ర‌క‌టించిన‌ట్లు ప్రధాని కార్యాలయం వివ‌రించింది. ‘యాస్’ తుపానుతో కలిగిన నష్టాన్ని సమీక్షించి, స్వయంగా అంచనా వేసేందుకు ప్రధాని మోదీ శుక్రవారంనాడు ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో పర్యటించారు.

బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలతో ప్రధాని  పరిస్థితిని మోదీ సమీక్షించారు. ఒడిశాలోని తుపాను బాధిత ప్రాంతాలైన భద్రక్, బలేశ్వర్ జిల్లాల్లోనూ, పశ్చిమబెంగాల్‌లోని పూర్బ మేదినీ పూర్‌లోనూ ప్రధాని ఏరియల్ సర్వే జరిపారు.

యాస్ తుఫాన్ బాధితుల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ సంఘీభావం తెలిపారు. ఈ ప్ర‌కృతి విప‌త్తులో త‌మ వాళ్ల‌ను కోల్పోయిన కుటుంబాల దుస్థితిపై ఆయ‌న తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. అదేవిధంగా యాస్ తుఫాన్ ప్ర‌భావంతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల‌కు రూ. 2 ల‌క్ష‌ల చొప్పున, గాయ‌ప‌డిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించ‌నున్న‌ట్లు ప్ర‌ధాని ప్ర‌క‌టించారు.

ఈ కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం పనిచేస్తుందని, అన్నివిధాలుగా ఆదుకుంటుందని ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ ప్రభుత్వాలకు ప్రధాని భరోసా ఇచ్చారని ప్రధాని కార్యాలయం తెలిపింది. నష్టం అంచనాకు, తదుపరి సాయం అందించేదుకు వీలుగా ఇంటర్ మినిస్టీరిల్ బృందాలు  కూడా ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తాయని ప్రధాని హామీ ఇచ్చారని పీఎంఓ పేర్కొంది.

ప్ర‌ధానితో స‌మీక్షాకు మ‌మ‌త డుమ్మా!

పశ్చిమబెంగాల్‌లో యాస్ తుఫాన్‌ సృష్టించిన బీభత్సంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వ‌హించ‌నున్న స‌మీక్షా సమావేశంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జి మొక్కుబడిగా కొద్దిసేపు ఉంది వెళ్లిపోయారు. రాష్ట్రంలో జరిగిన నష్టంపై ప్రధానికి వినతి పత్రం సమర్పించి ఆమె వెళ్లిపోయాయి.  యాస్ తుపాను విషయంపై ప్రధాని మోదీ నిర్వహించే సమీక్షా సమావేశానికి తాను హాజరు కానని, సీఎస్ హాజరవుతారని చెప్పిన సీఎం మమత 30 నిమిషాల ఆలస్యంగా హాజరయ్యారు.

ప్రధాని మోదీ, గవర్నర్ ధన్కర్ మమత కోసం 30 నిమిషాల పాటు వేచి చూశారు. ఆ తర్వాత సమీక్షా సమావేశాన్ని ప్రారంభించారు. హఠాత్తుగా, 30 నిమిషాల తర్వాత సీఎం మమత సమావేశానికి హాజరై, ఎక్కువ సేపు సమావేశంలో ఉండలేదు. తుపానుకు సంబంధించిన కొన్ని పత్రాలను మోదీకి సమర్పించి, అక్కడి నిష్క్రమించారు.  కేంద్ర ప్రభుత్వం – రాష్ట్ర‌ ప్రభుత్వం మధ్య జరుగాల్సిన ఈ స‌మావేశానికి బెంగాల్‌లో ప్రధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న బీజేపీ నేతలను ఆహ్వానించడంపై ఆమె  ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ మినహా ప్రతిపక్ష నేతలు ఈ సమావేశానికి వస్తే తాను హాజ‌రుకాబోన‌ని ఆమె కేంద్రానికి ఖ‌రాఖండిగా చెప్పారు. పశ్చిమబెంగాల్‌లోని కలైకుండలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అధ్య‌క్ష‌త‌న యాస్ తుఫాన్ న‌ష్టంపై సమీక్షా సమావేశంలో తాను కూడా పాల్గొంటానని గురువారం ఆమె స్వయంగా ప్ర‌క‌టించడం గమనార్హం.

సమావేశానికి బీజేపీ నేత సువేందు అధికారి, బీజేపీ ఎంపీ దేబొశ్రీ చౌదరి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లను కూడా ఆహ్వానించ‌డాన్ని ఆమె త‌ప్పు పట్టారు.  కాగా, ప్రధాని మోదీకి కలైకుండ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ స్వాగతం పలికారు. మమతా ప్రధాని నిర్వహించిన సమీక్ష సమావేశానికి గైరాజరు కావడాన్ని ఆయన విమర్శించారు.

సహాయం వద్దన్న నవీన్ పట్నాయక్ 

ఇలా ఉండగా, యాస్ తుఫాన్ బీభ‌త్సంతో వాటిల్లిన న‌ష్టాన్ని సొంత వ‌న‌రుల‌తోనే అధిగ‌మిస్తామ‌ని కేంద్రాన్ని ఎలాంటి తక్ష‌ణ సాయం కోర‌బోమ‌ని ఒడిషా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ స్పష్టం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం కొవిడ్-19 మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి భారంతో స‌త‌మ‌త‌మ‌వుతున్నందున తాము త‌మ సొంత వ‌న‌రుల‌తోనే తుఫాన్ క‌ష్ట‌న‌ష్టాల‌ను అధిగ‌మిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. భువ‌నేశ్వ‌ర్ లో తుఫాన్ ప్ర‌భావంపై నిర్వ‌హించిన స‌మీక్షా స‌మావేశంలోనూ న‌వీన్ ప‌ట్నాయక్ ఎలాంటి రిలీఫ్ ప్యాకేజ్ ను కోరలేదు.