బిజెపి మహిళా ఎంపీపై  రాళ్లు, ఇనుప రాడ్‌లతో దాడి 

బిజెపి మహిళా ఎంపీపై  రాళ్లు, ఇనుప రాడ్‌లతో దాడి 

కరోనాతో బాధపడుతున్న వారిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్తున్న బీజేపీ లోక్‌సభ సభ్యురాలి కారును అర్ధరాత్రి ఒక్కసారిగా నిలువరించి రాళ్లు, ఇనుప రాడ్‌లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో ఆమె వాహనం అద్దాలు పగిలిపోగా వాహనం తీవ్రంగా దెబ్బతింది. భయపడిపోయిన ఎంపీ సొమ్మసిల్లి పోయారు. ఆమెను వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే ఎంపీకి కానీ, కారులో ఉన్న ఇతరులకు కానీ తీవ్ర గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చికిత్స అనంతరం వారిని డిశ్చార్జ్ చేశారు.

రాజస్థాన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ లోక్‌సభ స్థానం నుంచి రంజిత కోలి గెలిచారు. ఆమె తన నియోజకవర్గంలోని ఆస్పత్రుల సందర్శనకు మంగళవారం బయల్దేరారు. తిరుగు ప్రయాణంలో రాత్రి 11.30 గంటల సమయంలో ధర్సోని గ్రామం మీదుగా భరత్‌పూర్‌ వెళ్తున్నారు.

గ్రామం మీదుగా ఒక్కసారిగా ఐదారుగురు వ్యక్తులు రాళ్లు, ఇనుప రాడ్‌లతో దాడికి తెగబడ్డారు. వీరి దాడితో ఎంపీ రంజిత, ఆమె అనుచరులు భయాందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారు డిశ్చార్జయ్యారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎంపీ రంజిత కోలి ట్విటర్‌లో పోస్టు చేశారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టనని,దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారని  తెలిపారు. అర్ధరాత్రి కావడంతో నిందితులను గుర్తించలేకపోయారు. ఆమె మామగారు గంగారామ్ కోలి బయానా నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.

ఆసుపత్రుల్లో కొవిడ్ పాజిటివ్ రోగులకు సరైన చికిత్స అందుతున్నదీ, లేనిదీ తెలుసుకునేందుకు జిల్లా ఆసుపత్రులను సందర్శిస్తున్నట్టు కోలి చెప్పారు. తనకు ఎవరిపైనా కోపం లేదని, ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి అన్ని వివరాలు వెల్లడిస్తారని కోలి తెలిపారు.

ఈ ఘటనపై రాజస్థాన్‌ బీజేపీ అధ్యక్షుడు సతీశ్‌ పూనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఈ దాడి చేసిందని ఆరోపించారు. నేరాలకు రాజస్థాన్‌ అడ్డాగా మారిందని విమర్శించారు.