ఆర్థిక పునరుత్తేజానికి ప్రైవేటు డిమాండ్ ముఖ్యం 

భారత దేశ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 మొదటి ప్రభంజనం చూపినంత ప్రభావం రెండో ప్రభంజనం చూపలేదని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తెలిపింది. అయితే అనిశ్చిత పరిస్థితులు స్వల్పకాలిక నిరోధంగా పనిచేసే అవకాశం ఉందని పేర్కొంది. పునరుత్తేజానికి ప్రైవేటు డిమాండ్ చాలా ముఖ్యమైనదని వివరించింది. 

కోవిడ్-19 రెండో ప్రభంజనం విజృంభణను ఎంత వేగంగా మన దేశం అడ్డుకోగలదనేదానిపైనే దేశ వృద్ధి అవకాశాలు ఆధారపడినట్లు తెలిపింది. గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ అంశాలను వివరించింది.

కోవిడ్-19 మహమ్మారి తర్వాత స్వయం సమృద్ధ జీడీపీ వృద్ధి పథం కోసం ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల డిమాండ్ చెప్పుకోదగిన స్థాయిలో పునరుద్ధరణ జరగాలని ఆర్బీఐ నివేదిక పేర్కొంది.  ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల డిమాండ్‌ వాటా జీడీపీలో దాదాపు 85 శాతం వరకు ఉంటుందని తెలిపింది. 

సాధారణంగా పెట్టుబడుల కన్నా వినియోగం ద్వారానే సంక్షోభానంతరం కోలుకోవడం ఎక్కువగా జరుగుతుందని, అయితే పెట్టుబడుల ద్వారా కోలుకోవడం వల్ల మరింత గట్టిగా నిలదొక్కుకోవడం సాధ్యమవుతుందని, తద్వారా మెరుగైన ఉపాధి సృష్టి జరుగుతుందని, కొంత వరకు వినియోగాన్ని పెంచవచ్చునని వివరించింది. 

సవరించిన అంచనాలు విడుదలైనపుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక లోటు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ప్రైవేటు పెట్టుబడులు పుంజుకుంటే, అధిక స్థాయుల్లో ఉండే లోటు, రుణాలు ఫైనాన్సింగ్‌కు సవాలు విసురుతాయని పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 21లో ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ 6.99 శాతం పెరిగి, రూ.57.08 ట్రిలియన్లకు పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఆదాయం 10.96 శాతం తగ్గిందని, అదే సమయంలో ఖర్చు కూడా 63.10 శాతం తగ్గిందని తెలిపింది. 

విదేశీ మారక ద్రవ్య లావాదేవీల నుంచి నెట్ గెయిన్స్ ఆర్థిక సంవత్సరం 20లో రూ.29.993 బిలియన్లు అని, ఆర్థిక సంవత్సరం 21లో 506.29 బిలియన్లు అని వివరించింది. గత వారం ప్రభుత్వానికి అందజేసిన మిగులు నిధుల్లో అధిక వాటా దీని నుంచే వచ్చినట్లు తెలిపింది.  

సంస్కరణలను అమలు చేస్తే భారత దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆర్బీఐ మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు ఆర్బీఐ బోర్డు గత శుక్రవారం ఆమోదం తెలిపింది. రూ.991.22 బిలియన్లను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. ఇది ఎవరూ ఊహించని పెద్ద మొత్తం.