
ఒడిశాలోని బాలాసోర్ వద్ద తీరం దాటిన యాస్ తుపాన్ . దేశ తూర్పు తీరంపై విరుచుకు పడింది. తీరం దాటడానికి ముందే ఒడిశాతోపాటు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలను అతలాకుతలం చేసింది. తుపాన్ తీరం దాటే సమయానికి చంద్రగ్రహణం, పౌర్ణమి కూడా తోడవుతుండడంతో సముద్రం అంతా అల్లకల్లోలంగా మారింది.
గంటకు 150 కిలోమీటర్ల వేగంతో భారీగా ఈదురు గాలులు వేశాయి. వర్షం కూడా కుండపోతలా కురుస్తుండడంతో ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లోని వందలాది గ్రామాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. పశ్చిమ బెంగాల్ లోని ఐదు జిల్లాల్లో, ఒడిశాలోని నాలుగు జిల్లాల్లో వందలాది గ్రామాలు నీట మునిగాయి.
తుఫాన్ ధాటికి ఒడిశా, బెంగాల్‌లో పలుచోట్ల భారీసంఖ్యలో ఇండ్లు, వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, టవర్లు నేలకొరిగాయి. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగా, రెమునాలో, భద్రక్ జిల్లా ధామ్రా, వాసుదేవ్‌పూర్‌లలో సముద్రం ముందుకొచ్చింది. తుఫాన్ కారణంగా ఒడిశాలో ముగ్గురు, బెంగాల్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం మధ్యాహ్నానికి యాస్.. అతితీవ్రం నుంచి తీవ్ర తుఫాన్ స్థాయికి బలహీనపడినట్టు వాతావారణ విభాగం తెలిపింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇది జార్ఖండ్‌ను తాకవచ్చని వెల్లడించింది.
తుఫాన్ నేపథ్యంలో ఒడిశా 5.8 లక్షల మందిని, బెంగాల్ 15 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. తుఫాన్ కారణంగా రాష్ట్రంలో సుమారు కోటి మంది ప్రభావితమయ్యారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. దాదాపు మూడు లక్షల ఇండ్లు దెబ్బతిన్నాయని చెప్పారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు రూ.10 కోట్ల విలువైన సహాయక సామగ్రిని తరలించినట్టు చెప్పారు. బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్‌లో ఉన్న దిఘా పూర్తిగా నీటమునిగింది. సహాయక చర్యల కోసం ఆర్మీ సాయం కోరారు. పర్యాటక ప్రాంతాలైన మందర్‌మని, తేజ్‌పూర్, శంకర్‌పూర్‌లో హోటళ్లు, నివాస సముదాయాల్లోకి సముద్రపు నీరు చేరింది.
సహాయక చర్యల కోసం ఆర్మీ 17 బృందాలను బెంగాల్‌కు తరలించింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలో సాగర్ దీవుల్లోని కపిల్ ముని ఆలయం నీట మునిగింది. యాస్ తుఫాన్ కారణంగా ప్రభావితమైన తమ కస్టమర్ల క్లెయిమ్‌లను వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్టు ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు డ్రోన్లను వినియోగించనున్నట్టు తెలిపింది.
ముఖ్యంగా ఒడిశాలోని భద్రక్ జిల్లాలో 30 గ్రామాలను సముద్రం నీరు ముంచెత్తి బీభత్సం సృష్టించింది. వందలాది ఇళ్ల పై కప్పులు ఈదురు గాలుల దెబ్బకు ఎగిరిపడ్డాయి. విద్యుత్ స్తంభాలే కాదు పెద్ద పెద్ద వట వృక్షాలు కూడా నేలకొరిగి వరదనీటి ప్రవాహంలో కొట్టుకుపోవడం కనిపిస్తోందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
బెంగాల్ రాజధాని కోల్ కతాలో కూడా కుండపోత వర్షం కురుస్తోంది. యాస్ తుపాను ప్రభావంతో తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. అన్ని విమాన, రైలు సర్వీస్ లను రద్దుచేశారు.
ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలోని బుధాబలంగ్ నదిలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. కెనోఝార్ జిల్లాలోని పంచుపల్లిలో చెట్టు కూలి ఒక వ్యక్తి మరణించారు. గురువారం కూడా సముద్రం అల్లకల్లోలంగానే ఉంటుందని అధికారులు తెలిపారు. తొమ్మిది జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ జారీచేశారు.
ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. మరోవైపు బెంగాల్‌లోని తూర్పు, పశ్చిమ మేదినీపూర్, ఝాగ్రమ్, బంకురా, దక్షిణ 24 పరిగణాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.
More Stories
జమ్ముకశ్మీర్‌లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
రామ జన్మభూమిలో తొలి `కరసేవక్’ కామేశ్వర చౌపాల్ మృతి
ఐదేళ్లలో తొలిసారి వడ్డీ రేట్లు తగ్గింపు